Idream media
Idream media
మొదటి నుంచీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు.. తనకు ముఖ్యమంత్రిగా పదవిని కట్టబెట్టిన ప్రజలకు అనువుగా ఉండేలా ఉంటున్నాయి. సచివాలయ వ్యవస్థతో సంచలనం సృష్టించిన ఆయన ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు మరో సంచలనానికి నాంది పలికారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అధిగమిస్తూ.. ఎక్కడా అదరక, దేనికీ బెదరక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కొత్త జిల్లాల పేర్లలో కొందరు ప్రముఖులకు, కొన్ని ప్రముఖ స్థలాలకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా జగన్ స్థానికులకు మరింత దగ్గర కానున్నారు. రాజకీయాలకు అతీతంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును కూడా ఓ జిల్లాకు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఉగాది పండగ నుంచే కొత్తగా ఏర్పాటయిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లలో పరిపాలన ప్రారంభమవ్వాలని సర్కారు ముందడుగు వేస్తోంది. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని పునర్‌వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలకు దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉండగా.. జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలతో పాటు స్థానికుల మనోభావాలకు అద్దం పట్టేలా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వాసులు ఎప్పటినుంచో ఆశిస్తున్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి శ్రీ బాలాజీ జిల్లాగా నామకరణం చేసి భక్తుల మన్ననలు పొందుతోంది. పుట్టపర్తిలో ప్రసిద్ధిచెందిన శ్రీ సత్యసాయి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం కూడా ఆసక్తిని రేపుతోంది. ఆ జిల్లాలో సరికొత్త చర్చకు దారితీసింది. రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంపై అభినందనీయమని ప్రశంసలు అందుతున్నాయి.
అంతేకాకుండా.. ఆదివాసీలతో పాటు యువత అభిమానించే శ్రీ అల్లూరి సీతారామరాజు పేరుతో ఓ జిల్లాను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం రాజకీయంగా కూడా సంచలనం రేపింది. చంద్రబాబు హయాంలో కూడా ఎన్టీఆర్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు, వాటికి పెట్టిన పేర్లను మెజార్టీ ప్రజలు, నేతలు, ప్రముఖులు ఆహ్వానిస్తున్నారు.