iDreamPost
iDreamPost
ఇటీవల అందరూ నార్త్, సౌత్ అని, పాన్ ఇండియా సినిమాలని పిలుస్తున్నారు. సౌత్ సినిమాలు భారీ విజయం సాధిస్తే పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు. బాలీవుడ్ సినిమాని మాత్రం హిందీ సినిమా అనే అంటున్నారు. దీనిపై హీరో సిద్దార్థ్ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ హీరో సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమాలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తను నటించిన ‘ఎస్కేప్ లైవ్’ అనే బాలీవుడ్ సిరీస్ రిలీజ్ కి ఉండటంతో ఆ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ మరోసారి పాన్ ఇండియా సినిమాలపై వ్యాఖ్యలు చేశాడు.
సిద్ధార్థ్ మాట్టాడుతూ.. పాన్ ఇండియా పదం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. నేను 15 ఏళ్ల నుంచి అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్‌గా, టాలీవుడ్‌లో చేస్తే తెలుగు అబ్బాయిలా, ఇప్పుడు హిందీలో కూడా. కానీ నా వరకు వాటిని ఇండియన్ సినిమాలు అని పిలవడమే ఇష్టం. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది.
ఈ వ్యాఖ్యలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అనట్లేదు. సినీ పరిశ్రమలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఓ హిందీ సినిమా భారీ విజయం సాధిస్తే దానిని హిందీ సినిమా అనే అంటారు. కానీ, ప్రాంతీయ సినిమాలకు అలా ఎందుకు ఉండదు? ప్రాంతీయ చిత్రాలు దేశమంతటా భారీ విజయం సాధిస్తే వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ సినిమా అనొచ్చు కదా. లేదా KGF సినిమా తన మాతృ భాషని గౌరవించి కన్నడ సినిమా అనొచ్చు కదా.
లేదా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని బట్టి ఇండియన్ సినిమా అనొచ్చు. కాబట్టి ఇక నుంచి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అసలు పాన్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు, ఆ పదమే చాలా ఫన్నీగా ఉంది అని వ్యాఖ్యానించాడు సిద్దార్థ. మరి సిద్దార్థ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.