iDreamPost
iDreamPost
వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు రెండు పెద్ద సినిమాలు ఓటిటికి ఇచ్చినప్పుడు పల్లెత్తు మాట అనని వాళ్ళు తనను మాత్రం వి, టక్ జగదీష్ విషయంలో విమర్శలు చేయడాన్ని నొచ్చుకున్న న్యాచురల్ స్టార్ నాని కొత్త పాన్ ఇండియా మూవీ శ్యామ్ సింగ రాయ్ ఈ నెల 24 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ల వేగం పెంచారు. రెండు రోజుల క్రితం సుమారు నాలుగు వేల మంది అభిమానులతో నాని పర్సనల్ మీట్ పెట్టుకున్నాడు. వాళ్లకు ఫోటోలు ఇవ్వడంతో పాటు వచ్చిన ప్రతిఒక్కరికి భోజనాలు పెట్టి మరీ పంపించారు. ఇంత పెద్ద స్థాయిలో నాని ఎప్పుడూ ఫ్యాన్ మీట్ నిర్వహించలేదు. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ కోసం ఇలా సెట్ చేసుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ శ్యామ్ సింగ రాయ్ పాన్ ఇండియా ప్రయాణానికి గట్టి చిక్కే వచ్చి పడింది. అదే రోజు 83 కూడా విడుదల కాబోతుండటం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. క్రికెట్ అంటే విపరీతంగా పడిచచ్చిపోయే అభిమానులకు నిన్న వదిలిన ట్రైలర్ కంటెంట్ ఓ రేంజ్ గూస్ బంప్స్ ఇచ్చింది. 1983 తాలూకు మొదటి వరల్డ్ కప్ విజయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన వైనాన్ని మరోసారి చూసేందుకు రెడీ అవుతున్నారు. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా దర్శకుడు కబీర్ ఖాన్ దీన్నో ఎమోషనల్ డ్రామాగా తీయడం ఆకట్టుకుంటోంది.
వరుణ్ తేజ్ గని రేస్ నుంచి తప్పుకుందని సంతోషించే లోపు శ్యామ్ సింగ రాయ్ కు ఈ ఇబ్బంది వచ్చి పడింది. అసలే వారం ముందు రెండు క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద దిగుతున్నాయి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తో పాటు పుష్పలు వరసగా 16, 17 తేదీలలో థియేటర్లలో అడుగు పెడతాయి. శ్యామ్ సింగ రాయ్ వచ్చినంత మాత్రాన పైన రెండింటిని థియేటర్లలో వీటిని తీసేయరుగా. ఒప్పందం ప్రకారం చెప్పుకోదగ్గ కౌంట్ లోనే అవి కొనసాగుతూ ఉంటాయి. సో 83తో కంటెంట్ లోనే కాదు స్క్రీన్లను పంచుకోవడంలోనూ శ్యామ్ సింగ రాయ్ పోటీ పడాల్సి ఉంటుంది. మొత్తానికి నానికి రెండు వైపులా కత్తులు దూసే కలెక్షన్ల యుద్ధం తప్పేలా లేదు
Also Read : Theatres : థియేటర్లు నిండాలంటే వాళ్ళు రావాల్సిందే