ఏమిటా సరి.. బేసి..?

తెలంగాణలో లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కెసిఆర్ దాదాపు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మినహా రాష్ట్రం అంతటా దుకాణాలు తెరుచు కోవచ్చని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మాత్రం సరి – బేసి పద్ధతిన దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. నిన్నటి వరకూ ఇతర మునిసిపాలిటీ ల్లో ఇదే విధానాన్ని అవలంబించారు. అక్కడ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు అనుమతి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో సరి – బేసి విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో ఒక రోడ్డు లో వరుసగా దుకాణాలు అన్నింటికీ నంబర్స్ ఇచ్చుకుంటూ పోతారు.

1, 3, 5, 7… ఇలా బేసి సంఖ్యలు కేటాయించిన దుకాణాలు ఒక రోజు.. 2, 4, 6, 8… ఇలా సరి సంఖ్యలు కేటాయించిన దుకాణాలు మరో రోజు తెరుచుకుంటాయి. అంటే.. ప్రతీ వ్యాపారి రోజు విడిచి రోజు మాత్రమే వ్యాపారం చేసుకోవాలి. ఏ రెండు దుకాణాలు వరుసగా తెరిచుండకూడదు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో దుకాణాలకు నంబర్స్ కేటాయిస్తూ మార్కింగ్ వేస్తున్నారు. అయితే.. సరి – బేసి పద్ధతి ఎంత మేరకు వ్యాపారులు పాటిస్తారో చూడాలి. అందరూ కచ్చితంగా పాటించాల్సిందే అని అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో లాక్ డౌన్ వరకూ వ్యాపార దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మంగళవారం చాలా ప్రాంతాల్లో వరుసగా అన్ని దుకాణాలు తెరిచే ఉన్నాయి.

Show comments