Idream media
Idream media
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.ఈసారి నిరసనకారుల చేతిలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి చేదు అనుభవం ఎదురైంది.
ముజఫర్ పూర్ జిల్లాలోని సక్రా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సీఎం నితీశ్ కుమార్‌పై స్థానిక యువకులు చెప్పుల దాడి పాల్పడ్డారు.సక్రా ఎన్నికల సభలో ప్రసంగించిన తర్వాత ఆయన సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు బయలుదేరారు. ఆ సమయంలో సీఎం నితీశ్‌ని లక్ష్యంగా చేసుకుని నలుగురు యువకులు చెప్పులు విసిరారు. అయితే అవి ముఖ్యమంత్రికి తగలకుండా దూరంగా వెళ్లి పడ్డాయి. తనపై దాడితో సీఎం నితీశ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.కాగావెంటనే స్పందించిన పోలీసులు దాడికి పాల్పడ్డ యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇక జేడీయూ నేత,ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ ఎన్నికల ప్రచార సభలకు ప్రజల నుండి పెద్దగా స్పందన లభించడం లేదు.ఎన్డీయే సభలకు జనం పలుచగా రావడమే గాక ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటం పరిపాటిగా మారింది.దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న ఆయన ఒకానొక దశలో ” మాకు ఓటు వేస్తే వేయండి..లేకపోతే పొండి ” అంటూ ఆగ్రహంతో చిందులుతొక్కారు. ఈ క్రమంలో సోమవారం తనపై జరిగిన చెప్పుల దాడికి ప్రతిపక్ష ఆర్జేడీ కారణమని సీఎం నితీశ్ ఆరోపించాడు.
గత వారం ఎన్నికల ప్రచారంలో ఇలాంటి చేదు అనుభవమే మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కి కూడా ఎదురైంది. ఔరంగాబాద్ జిల్లాలోని కుతుంబా అసెంబ్లీ స్థానంలో ప్రచారం కోసం వెళ్లిన ఆయనపై స్థానిక యువకులు చెప్పులు విసిరారు. అందులో ఒకటి ఆయన ఒడిలో పడింది.అయితే ఈ దాడి అనంతరం ప్రసంగించిన తేజస్వీ యాదవ్ ఆ అంశాన్ని ప్రస్తావించకుండా హుందాగా ప్రవర్తించాడు.
కాగా హోరాహోరీగా సాగుతున్న బీహార్ ఎన్నికలలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచిచూడాలి.