iDreamPost
iDreamPost
ఎలాగూ సెన్సార్ లేదు. ఎవరూ ప్రశ్నించరు. బోల్డ్ కంటెంట్ పేరుతో నగ్నత్వాన్ని, బూతుని ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్న ఓటిటిల దూకుడుకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేయబోతోంది. ఇప్పటిదాకా కేవలం సినిమాలకు, ప్రెస్ కు మాత్రమే ఉన్న నియంత్రణ ఇకపై డిజిటల్ కంటెంట్ కు కూడా వర్తించబోతోంది. ముఖ్యంగా ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు చాలా ఓపెన్ గా అడల్ట్ ఎంటర్ టైన్మెంట్ ని ఇస్తున్నాయి. వాటిలో కథాకథనాలు బాగున్నప్పటికీ అందులో ఉన్న ద్వందార్థాలు, శృంగార సన్నివేశాలు ఎంతలేదన్నా యువత మీద ప్రభావం చూపిస్తున్నాయి. దీని గురించి ఇప్పటికే పలు ఫిర్యాదులు పలు కోర్టుల్లో దాఖలయ్యాయి.
ఈ నేపథ్యంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డిజిటల్ కంటెంట్ ని నియంత్రించేందుకు రూపొందించిన విధి విధానాలను ప్రెసిడెంట్ రామ్ నాధ్ కోవింద్ అధికారిక అమలుకు అనుమతి ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీ కంట్రోల్ లో ఈ విభాగం ఉండబోతోంది. దీనికి ప్రకాష్ జవదేకర్ నేతృత్వం వహిస్తారు. ఇకపై టీవీ ఛానల్స్ కార్యక్రమాల తరహాలోనే వీటికి ప్రత్యేకమైన సెన్సార్ విధానం రాబోతోంది. సినిమాల తరహాలో కాకపోయినా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించని వారిపై తీవ్ర చర్యలు ఉంటాయి. సదరు యాప్స్ లేదా సైట్స్ ని నిషేధించే స్థాయిలో వీటికి అధికారాలు ఉంటాయి.
ఇటీవలి కాలంలో ప్రాంతీయ వెబ్ కంటెంట్ లో సైతం బోల్డ్ నెస్ పెరుగుతోంది. అదేమంటే సహజత్వానికి పెద్ద పీఠ వేస్తున్నాం, ఉన్నదే చూపిస్తున్నాం బయట జరిగేదే మాట్లాడిస్తున్నాం అనే సమర్ధనలు ఎక్కువయ్యాయి. ఇప్పుడీ పరిణామం ఓటిటి సంస్థలు ఊహించని షాక్. ఇకపై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలాంటి కంటెంట్ ఇచ్చినా ఇండియాకు వచ్చేటప్పటికీ సెల్ఫ్ సెన్సార్ చేసుకోక తప్పేలా లేదు. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు. మొత్తానికి ఈ చర్య పట్ల అధిక శాతం ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మరి స్ట్రీమింగ్ యాప్స్ దీనికి ఎలా స్పందిస్తాయో చూడాలి