iDreamPost
iDreamPost
కరోనాతో పోరాడి గెలిచాక కూడా నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస తీసుకున్న శివ శంకర్ మాస్టర్ జ్ఞాపకాలతో యావత్ సినిమా ప్రపంచం శోకంలో మునిగిపోయింది. కొనఊపిరి వరకు డాన్సు తప్ప మరో ఊసు లేకుండా గడిపిన ధన్య జీవి ఆయన. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలుకుని ఇప్పటి చరణ్ మహేష్ దాకా అందరూ ఆయన కంపోజింగ్ తో వెండితెరమీద అద్భుతాలు చేసినవాళ్ళే. నృత్య దర్శకుడిగానే కాదు డాన్స్ రియాలిటీ షోలలో జడ్జ్ గా ఇప్పటి తరానికి ఎన్నో సూచనలు అనుభవాలు పంచుకోవడం చిరకాలం సజీవంగా ఉంటాయి. పది భాషల్లో 800కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన ఘనత శివ శంకర్ మాస్టర్ సొంతం.
2009లో మగధీరలో చరణ్ కాజల్ అగర్వాల్ మీద చిత్రీకరించిన ధీర ధీర మనసాగలేదురా పాట కోసం 22 రోజులు పడిన కష్టానికి శివ శంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డు దక్కడం ఓ మధుర ఘట్టం. అప్పుడాయన అరవై ఏట ఉన్నారు. అరుంధతి పాట కోసం ఏకంగా నెల రోజులు వర్క్ చేయడం గురించి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. శివ శంకర్ మాస్టర్ పుట్టిన తేదీ 1948 డిసెంబర్ 7. తల్లితండ్రులు కళ్యాణ్ సుందర్, కోమల అమ్మాళ్.భార్య పేరు సుకన్య. ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్ లు నాన్న పేరుని కొనసాగిస్తూ డాన్స్ మాస్టర్స్ గా ఉన్నారు. వైవిధ్యమైన శారీరక భాషతో నిజ జీవితంలోనూ ప్రత్యేకత సొంతం చేసుకున్న శివ శంకర్ అనేది పేరు కాదు ఒక బ్రాండ్
చిరంజీవికి గొప్ప బ్రేక్ ఇచ్చిన ఖైదీకి డాన్స్ మాస్టర్ సలీం అయినప్పటికి ఎక్కువగా కంపోజింగ్ చేసింది మాత్రం శివ శంకరే. అసిస్టెంట్ గా తనకు ఇచ్చిన బాధ్యతలు ఇలాంటి సందర్భాల్లో అద్భుతంగా నెరవేర్చేవారు. ఈయన మొదటి సినిమా తమిళంలో వచ్చిన కురువికూడు. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ ఈయన్ని చిన్న మాస్టర్ అని పిలిచేవారు. నటుడిగా పలు చిత్రాల్లో కనిపించారు. సర్కార్, నేనే రాజు నేనే మంత్రి, గ్యాంగ్, ఎన్టీఆర్ కథానాయకుడులో మంచి పాత్రలు వేశారు. భౌతికంగా శివ శంకర్ మాస్టర్ మన మధ్య లేకపోయినా ఆయన నృత్యాలు, క్యారెక్టర్లు, న్యాయనిర్ణేతగా చేసిన కార్యక్రమాలు హృదయాల్లో శాశ్వత స్థానాన్ని కలిగి ఉంటాయి
Also Read : Fake Accounts : నకిలీ ఖాతాల మీద లైవ్ డిబేట్లు – ఇది ట్విస్ట్ అంటే