iDreamPost
iDreamPost
భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన మహా సముద్రం తీవ్రంగా నిరాశపరచడం శర్వానంద్ తో పాటు అభిమానులూ ఊహించనిది. ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ ని ఎవరూ ఆశించలేదు. పది మంది హీరోలు దీన్ని తిరస్కరించారని చెప్పుకొచ్చిన అజయ్ దానికి కారణం సినిమా రూపంలో చెప్పేశారు. దెబ్బకు విడుదల రోజు నుంచి ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికిప్పుడు ఈయన నెక్స్ట్ సినిమాకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు కానీ అసలు చిక్కు మాత్రం శర్వానంద్ కు వచ్చి పడింది. ఎందుకంటే డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా ఇది అయిదో డిజాస్టర్ కావడమే.
ఈ పరంపర ‘రణరంగం’తో మొదలయ్యింది. ప్రస్థానం రేంజ్ లో బిల్డప్ ఇచ్చి అంచనాలు పెంచి వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నష్టం కూడా ఆరు కోట్లకు పైగా గట్టిగానే వచ్చింది. తర్వాత ‘పడి పడి లేచే మనసు’ ఇంకా దారుణం. సాయి పల్లవి హను రాఘవపూడి కాంబో ఎంత మాత్రం పని చేయక రెండో వారానికే వెనక్కు వచ్చే పరిస్థితి. దిల్ రాజు ముచ్చట పడి మరీ రీమేక్ హక్కులు కొనుకున్న ‘జాను’ ఫలితం సరేసరి. చూసిన ప్రేక్షకులకు నీరసం, నిర్మాతకు నష్టం ఒకేసారి వచ్చాయి. మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ ‘శ్రీకారం’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కట్ చేస్తే 14 రీల్స్ కు లాస్ తప్పలేదు.
ఇప్పుడు ‘మహా సముద్రం’ వంతు వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్ గానే చేసినప్పటికీ సగం రాబట్టేందుకే ముచ్చెమటలు పడుతోంది. దీనికన్నా బ్యాడ్ టాక్ వచ్చిన పెళ్లి సందడికి చాలా చోట్ల మంచి కలెక్షన్లు రావడం గమనార్హం. అంటే మినిమమ్ కంటెంట్ కూడా మహాసముద్రంలో లేదనే రిపోర్ట్ బయటికి రావడమే ఈ స్థితికి కారణమని చెప్పొచ్చు. యూత్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కే ఓటు వేయడంతో శర్వా మూవీకి కోలుకునే అవకాశం లేకపోయింది. సో శర్వానంద్ ఆశలన్నీ ఇప్పుడు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మీదే ఉన్నాయి. రష్మిక మందన్న-లేడీస్ సెంటిమెంట్-తిరుమల కిషోర్ డైరెక్షన్ ఏదైనా మేజిక్ చేస్తాయేమో చూడాలి మరి
Also Read : Trisha : సినిమాలతో పోటీ పడుతున్న వెబ్ సిరీస్ లు