షకీలా సినిమా పాలి’ట్రిక్స్’ – రాజధాని వికేంద్రీకరణ

ఒకప్పుడు 90 దశకంలో కేరళలో శృంగారతారగా రాజ్యమేలిన షకీలా ఆ తర్వాత తెలుగులోనూ బాగానే పేరు తెచ్చుకుంది. ఒక టైంలో మల్లువుడ్ లో మోహన్ లాల్ మమ్ముట్టి లాంటి పెద్ద హీరోలు సైతం ఈమె మార్కెట్ కు భయపడే వారని అప్పట్లో మలయాళ పత్రికలు కథనాలు రాసేవి. ఈ ఫ్లాష్ బ్యాక్ ని కాసేపు పక్కనపెడితే మళ్ళీ సినిమాలతో కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది షకీలా. గత ఏడాది శీలావతి అనే మూవీ చేస్తే దాన్ని కొనే నాథుడు లేకపోవడంతో పాటు ఏవో సెన్సార్ చిక్కులు వచ్చాయనే నెపంతో నేరుగా యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తోంది. దాని పేరే షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. ఇంత పొడవు టైటిల్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఆ సంగతి దర్శకుడు సాయిరామ్ దాసరినే చెప్పాలి. ఇదిలా ఉండగా దీని ప్రమోషన్ కోసం మేకర్స్ వర్తమాన రాజకీయాలను వాడుకోవడం చూస్తే నవ్వు రాక మానదు.

ఇటీవలే విడుదల చేసిన చిన్న టీజర్ లో షకీలా ఏపీ మూడు రాజధానుల ప్రస్తావన తెస్తుంది. తన పనివాడితో భవిష్యత్తులో ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చినా ఆశ్చర్యం లేదంటూ వ్యంగ్యంగా అంటుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా ఉన్న త్రీ క్యాపిటల్ ఇష్యూ ని ఇలా వాడుకోవడంలో ఉద్దేశం ఏదైనా ప్రతిపక్ష పార్టీ టిడిపి మాత్రం ఇదేదో గొప్ప వీడియో అనే తరహాలో వైరల్ చేస్తూ ఒకరకంగా నవ్వులపాలవుతోంది. సినిమా ప్రచారం కోసం కావాలని పెట్టిన సీన్ తో వీడియో రిలీజ్ చేస్తే కాగల కార్యం ఇంకెవరో నెరవేర్చినట్టు దాన్ని తెలుగుదేశం వర్గాలు తలకెత్తుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం నిజంగా విచిత్రమే. మొత్తానికి ఎవరూ పట్టించుకోని సినిమాకు షకీలా రూపంలో ఇలా పాలిట్రిక్స్ చేయడం ఏమిటో.

Show comments