iDreamPost
android-app
ios-app

శాటిలైట్ ఛానల్స్ కు అవే శాపం

  • Published Nov 02, 2020 | 6:25 AM Updated Updated Nov 02, 2020 | 6:25 AM
శాటిలైట్ ఛానల్స్ కు అవే శాపం

ఒకప్పుడు ఏదైనా కొత్త సినిమా టీవీలో వస్తోందంటే ఆ ఆనందమే వేరుగా ఉందేది. 90 దశకంలో కేవలం దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ఆదివారం వేసే ఎలాంటి మూవీ అయినా సరే ప్రేక్షకులందరూ కుటుంబాలతో సహా ఒకేచోట గుమికూడి తిష్టవేసేవారు. మూడు గంటల పాటు ఏదో దైవ దర్శనం చేసుకున్నంత తన్మయత్వంలో మునిగితేలేవారు. శాటిలైట్ వచ్చాక మొత్తం మారిపోయింది. కేబుల్ వచ్చాక కొత్త విప్లవం మొదలయ్యింది. అసలైన వినోదంలోని మజాని జనం ఆస్వాదించడం మొదలుపెట్టారు. మొదట జీ, ఈటీవీ, జెమిని ఇలా పరిమిత సంఖ్యలో ఛానల్స్ ఉండేవి. రాను రాను అవి పుట్టగొడుగుల్లా మారిపోయి ఇప్పుడు కౌంట్ ఎంతనో చెప్పడం కష్టమయ్యే రీతిలో పెరిగిపోయాయి. ఆడియన్స్ కి ఇబ్బడిముబ్బడిగా ఆప్షన్స్ వచ్చేశాయి.

క్రమక్రమంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. థియేటర్ లో చూసింది అయినా సరే ఇంట్లో కూర్చుని బుల్లితెరపై చూస్తే వచ్చే కిక్కే వేరు. అందుకే డిజాస్టర్లు సైతం 15 పైగా రేటింగ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దానికి మంచి ఉదాహరణ సర్దార్ గబ్బర్ సింగ్. ఇక బాహుబలి, మగధీర, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు సృష్టించిన టీవీ రికార్డుల గురించి చెప్పేదేముంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఓటిటిలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ డెఫినేషన్ మారిపోయింది. ఒకసారి చందా కడితే చాలు ఏడాది మొత్తం నాన్ స్టాప్ మూవీస్, వెబ్ సిరీస్ లను ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది. దానికి తోడు లాక్ డౌన్ వల్ల నేరుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజులు స్టార్ట్ కావడంతో థియేటర్లు మూతబడినా పెద్దగా లోటు తెలియడం లేదు.

అందుకే ఇటీవలి కాలంలో కొత్త సినిమాల ప్రీమియర్లకు ఆశించినంత రేటింగ్స్ రావడం లేదు. మొన్న సాహో తీవ్రంగా నిరాశపరచగా ఉమామహేశ్వరఉగ్రరూపస్య, భానుమతి రామకృష్ణ లాంటి స్ట్రెయిట్ ప్రీమియర్లు కూడా యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కెజిఎఫ్ సైతం 11 దగ్గరే ఆగిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. యాడ్స్ తలనెప్పి లేకుండా కోరుకున్న టైంలో చాలా ముందుగా ఓటిటిలో కొత్త సినిమాలు చూసే ఛాన్స్ ఉన్నప్పుడు ఛానల్ నిర్దేశించిన టైంలోనే అదే పనిగా తిష్ట వేసుకుని కూర్చునే అవసరం తప్పింది. ఇలాంటి కారణాలన్నీ శాటిలైట్ బిజినెస్ మీద ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఇకపై ఫస్ట్ టెలికాస్ట్ ని మరీ ఆలస్యం చేయకుండా నిర్మాతగా ఒప్పందాలు చేసుకునేలా శాటిలైట్ యాజమాన్యాలు తమ ప్లానింగ్ ని మార్చుకుంటున్నాయి