iDreamPost
iDreamPost
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్యం సాగించి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. సంబరంగా జరుపుకోవాల్సిన ఈ వేడుక వేళ పార్టీలో ఉత్సాహం బదులు.. ఒక రకమైన ఉత్కంఠ, ఆందోళన కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీలో ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ పార్టీని హస్తగతం చేసుకుంటానని సవాళ్లు విసురుతున్నారు. పార్టీ స్వర్ణోత్సవ సందర్భాన్నే దానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఒకప్పటి పత్రిక నమదు ఎంజీఆర్ లో నాలుగైదు రోజులుగా వ్యాసాల రూపంలో సంకేతాలు పంపుతున్నారు. శశికళ వ్యాసాలు అన్నాడీఎంకేలో ప్రకంపనలు రేపుతున్నాయి.
పార్టీని ఈ స్థితిలో వదిలిపెట్టను.. నేను వస్తున్నా..
1972లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే ఈ నెల 17న స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఆ రోజు నుంచి స్వర్ణోత్సవాలు జరపాలని పార్టీ నిర్ణయించింది. సరిగ్గా ఇదే సందర్భాన్ని తన పునరాగమనానికి ముహూర్తంగా శశికళ నిర్ణయించుకున్నారు. దానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 16నే చెన్నై మేరీనా బీచ్ లో ఉన్న ఎంజీఆర్, జయలలితల సమాధుల వద్ద ఆమె నివాళులు అర్పించి.. పార్టీని మళ్లీ చేజిక్కించుకునే దిశగా అడుగులు వేయనున్నారు.
Also Read : తల పట్టుకున్న ముఖ్యమంత్రి..!
కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న ఆమె నాలుగు రోజులుగా నమదు ఎంజీఆర్ పత్రికలో వరుసగా రాస్తున్న వ్యాసాల ద్వారా పార్టీ కార్యకర్తలకు సందేశాలు పంపుతున్నారు. ఎంజీఆర్, జయల హయాంలో పార్టీ ఉన్నత స్థితిలో ఉండేదని గుర్తు చేస్తూ.. కొందరి నిర్వాకాల వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని ఈ స్థితిలో వదిలిపెట్టలేనని స్పష్టం చేశారు. నేను వస్తున్నాను.. పార్టీని మళ్లీ పూర్వస్థితిలో నిలబెడతానని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ శక్తులూ తనను అడ్డుకోలేవని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. జయ అభిమానులు, కార్యకర్తలు భయపడకుండా పార్టీని గాడిలో పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అన్నాడీఎంకేలో నిశ్శబ్దం
శశికళ తాజా వ్యాఖ్యలు, హెచ్చరికలతో అన్నాడీఎంకేను ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. శశికళ ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా వెంటనే స్పందించి ఖండించే మాజీమంత్రి డి. జయకుమార్ సైతం శశికళ వరుసగా వ్యాసాలు వదులుతున్నా ఏమాత్రం స్పందించడం లేదు. మరోవైపు స్వర్ణోత్సవాల నిర్వహణకు సంబంధించి శనివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ సమన్వయకర్తలుగా ఉన్న మాజీ సీఎంలు పన్నీరు సెల్వం, పళనిస్వామితో సహా అగ్రనేతలందరూ హాజరు కావాల్సిన ఈ సమావేశాన్ని హఠాత్తుగా సోమవారానికి వాయిదా వేశారు. శశికళ తాజా వ్యాఖ్యలే దీనికి కారణమని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. పైకి చెప్పకపోయినా శశికళ ఏం చేస్తారోనన్న ఆందోళన.. ఆమె వ్యూహాలపై ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొన్నాయి. పార్టీ స్వర్ణోత్సవాలను అధికారంలో లేని సమయంలో నిర్వహించుకోవాల్సి రావడం ఒకవైపు బాధ పెడుతుంటే.. శశికళ ఉదంతం మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Also Read : కేంద్ర మంత్రి మాటలు అవాస్తవమేనా? రైతుల మృతికి కారకులెవరు?