iDreamPost
android-app
ios-app

చెత్తలో మోడి, ఆదిత్యనాథ్ ఫోటోలు. యూపీలో పారిశుద్ధ్య కార్మికుడిపై వేటు, ఆందోళ‌న‌తో మ‌ళ్లీ విధుల్లోకి

  • Published Jul 19, 2022 | 7:55 PM Updated Updated Jul 19, 2022 | 7:55 PM
చెత్తలో మోడి, ఆదిత్యనాథ్ ఫోటోలు. యూపీలో పారిశుద్ధ్య కార్మికుడిపై వేటు, ఆందోళ‌న‌తో మ‌ళ్లీ విధుల్లోకి

ఆ పారిశుద్ధ్య కార్మికుడు రోజూ తోపుడు బండిలో చెత్త తీసుకెళ్తాడు. ఆ రోజు కూడా ఎప్పట్లాగే బండిలో చెత్త నింపుకున్నాడు. దాంతో పాటే కొన్ని పాత ఫోటోలు కూడా వేసుకున్నాడు. అదే అతని కొంప ముంచింది. ఉన్న కాస్త ఉపాధీ పోయింది.

40 ఏళ్ళ బాబీ మథుర మునిసిపల్ కార్పోరేషన్ లో కాంట్రాక్ట్ వర్కర్. అతనో రోజు తోపుడు బండిలో చెత్త తీసుకెళ్తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న కొందరు అతణ్ణి ఆపారు. తోపుడు బండిలో కనపడ్డ పాత ఫొటోలు బయటికి తీశారు. వాటిలో ఒకటి ప్రధాన మంత్రి మోడీది, మరొకటి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ది. వీళ్ళెవరో నీకు తెలుసా అని బాబీని అడిగారు. అతను తెలియదన్నాడు. చెత్తలో దొరికితే తీసుకెళ్తున్నా అని అమాయకంగా చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది. దెబ్బతో మున్సిపల్ కార్పొరేషన్ బాబీని విధుల నుంచి తొలగించింది. నిర్లక్ష్యం కారణంగానే అతణ్ణి పనిలో నుంచి తీసేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తాను చదువుకోలేదని అందుకే ఫొటోల్లో ఉన్నది ఎవరో తెలుసుకోలేకపోయానని బాబీ అధికారుల ముందు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. పైగా అతనికి ప్ర‌ధాని, సీఎం గురించి చెప్ప‌నందుకు శానిటరీ ఇన్ స్పెక్టర్, సూపర్ వైజర్లకు షోకాజ్ నోటీసులు వెళ్ళాయి.

ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు రావ‌డంతో మ‌ళ్లీ అత‌న్ని విధుల్లోకి తీసుకున్నారు.