Idream media
Idream media
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డెయిరీని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ కు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మయూర్ అశోక్.. వడ్లమూడిలోని సంగం డెయిరీకి చేరుకుని కార్యకలాపాలను సమీక్షిస్తున్నారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రను గత శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ధూళిపాళ్ళను రాజమండ్రి కేంద్ర కర్మాగారానికి తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఈ డెయిరీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఛైర్మన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో పేర్కొంది.
కాగా, డెయిరీ రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అవినీతి కారణంగానే డెయిరీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. మరోవైపు డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
1977లో ప్రారంభమైన సంగం డెయిరీ టర్నోవర్ ప్రస్తుతం ఏడాదికి రూ. 913 కోట్లకు పైగా ఉంది. అలాగే డెయిరీకి సంబంధించి రూ.160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.
Also Read : అవినీతి వ్యవహారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, అది కూడా 23 నాడే..