iDreamPost
android-app
ios-app

Sangam barrage -jalayagnam -తండ్రి ప్రారంభించారు.. త‌న‌యుడు పూర్తి చేశారు..!

Sangam barrage -jalayagnam -తండ్రి ప్రారంభించారు.. త‌న‌యుడు పూర్తి చేశారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ని సంగం బ్యారేజీ పెన్నా డెల్టాకు జీవనాడి. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్‌ సర్కార్‌ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా పెన్నా డెల్టాలో 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. కాల‌క్ర‌మేణా బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్టస్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.

జలయజ్ఞంలో భాగంగా పాత బ్యారేజీకి ఎగువన.. కొత్తగా సంగం బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్‌ 2005లో శ్రీకారం చుట్టారు. అటు ఆయకట్టుకు నీళ్లందించేలా, ఇటు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేలా బ్యారేజీ కమ్‌ బ్రిడ్జిగా కొత్త సంగం బ్యారేజీని డిజైన్‌ చేశారు. వైఎస్సార్‌ హఠాస్మరణం తర్వాత ఈ బ్యారేజీ పనులు పడకేశాయి. టీడీపీ సర్కార్‌ బ్యారేజీని పూర్తిచేయడంలో విఫలమైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను, అధికారులను ఆదేశించారు. దీంతో ఈ బ్యారేజీ పనులు పరుగులెత్తుతున్నాయి. దశాబ్దానికి పైగా నత్తనడకలు నడిచిన సంగం బ్యారేజీ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే సంగం బ్యారేజీ ఎర్త్‌ వర్క్‌లు, ఇతర మేజర్‌ పనులు పూర్తయ్యాయి. ఆయన అకాల మరణంతో నత్తనడకన పనులు సాగాయి. బ్యారేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతాంగం ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి సంకల్పించిన జలవనరుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా సంగం ఆనకట్ట పనులకు నిధులు కేటాయించి, పెండింగ్‌ పనులను పరుగులు పెట్టించారు. నూతన సంగం ఆనకట్ట నిర్మాణం కాంక్రీట్‌ పనులు పూర్తవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 3.85 లక్షల ఎకరాల సాగుకు స్థిరీకరణ జరుగుతుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాత సంగం ఆనకట్ట దెబ్బతినడంతో వర్షాలు వచ్చిన ప్రతి సారి సంగం ఆనకట్టపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంగం పెన్న అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసరాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. నీటి ప్రవాహంలో ఆనకట్టను దాటుతూ ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నూతన ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తవుతుండడంతో రాకపోకల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ ఆనకట్ట రోడ్‌ లెవల్‌ 40.96 మీటర్లు ఉండడం వల్ల రాకపోకలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోడ్డు ఉపయోగంలోకి వచ్చేందుకు కొంచెం మట్టి పనులు మాత్రమే పెండింగ్‌ ఉంది. పక్షం రోజుల్లో మట్టి పనులు పూర్తయి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. నవంబర్‌ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. జనవరి నెలాఖరులోపు ఈ బ్యారేజీ ప‌నులు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరందించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు అన్ని చ‌ర్య‌ల‌నూ చేప‌ట్టింది.

Also Read : RBK – ఏపీ బాటలో కేరళ.. జగన్‌ ఆలోచన అమలుకు సిద్ధమైన కేరళ సర్కార్‌