iDreamPost
iDreamPost
ఇసుక ఇసుక ఇసుక … కొన్ని పత్రికలు ఇసుకను నిత్యావసర వస్తువును చేశాయి…ఇసుక లేక లక్షలమంది రోడ్డునపడ్డారు అని గత నెలగా రాస్తున్నారు. ఈ వార్తలు చదివితే రాష్ట్రంలో ఒక్క భవన నిర్మాణం కూడా జరగటం లేదన్న స్థాయిలో ఇసుక సమస్య ఉంది.
వాస్తవంగా ఆ పత్రికలు ముఖ్యంగా ప్రధాన పత్రిక గతంలో అంటే ఈ సంవత్సరం మే నెల 30న అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ఇసుక సమస్య మీద ఏమి రాసిందో చూడండి.
ఇసుక కొరత మూలంగా …
ఒక్క విశాఖపట్నంలోనే రెండు వేలకు పైగా గృహనిర్మాణ ప్రాజెక్టులు ఆగిపోయాయి.
శ్రీకాకుళం జిల్లాలోనూ వందకు పైగా నిర్మాణాలు ఆగిపోయాయి.
ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక్క విశాఖ నగరంలోనే 30 వేల మందికి పైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయారు.
శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ కేటాయించిన రేవుల్లో తగినంత ఇసుక లేదు.
విజయనగరం జిల్లాలో ఉన్న ఇసుక రేవుల్లో తవ్వడానికి అనుమతులు లేవు.
ఉభయ గోదావరి జిల్లాలతో సహా మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
ఒక్క విశాఖలోనే ఇసుక రవాణా మీద ఆధారపడి జీవిస్తున్న 500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఒక్క విశాఖలోనే రోజుకు 200 లారీల ఇసుక అవసరమైతే ప్రస్తుతం ఒకటి రెండు లారీల ఇసుక మాత్రమే లభ్యమవుతోంది.
మే 30 న వచ్చిన ఈనాడులోని వార్తలో ‘రెండు నెలలుగా అదే గడ్డు పరిస్థితి’ అని ఉపశీర్షిక ఒకటి ఉంది – అంటే మార్చి నెల నుంచి అనుకుందాం. అప్పటి నుంచి ఉన్న ఇసుక కొరతకు ఈ సంవత్సరం పడ్డ వర్షాలు, పోటెత్తిన వరదలు కూడా తోడయ్యి సమస్య మరింత జటిలమయ్యింది . ప్రస్తుతం ప్రతిరోజూ మెయిన్ పేజీల్లో ‘అచ్చోసి’వదులుతున్నట్టుగా మార్చి నెల నుంచి ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన రోజు వరకు కథనాలు ఎందుకు ఇవ్వలేదు ?! ‘ఇసుక కొరత’ అనే సాకును చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద తమ అక్కసును వెళ్లగక్కుతున్న వారు ఆ రోజున ఎందుకు ఈ విషయం గురించి కనీసం నోరెత్తి మాట్లాడలేదు ?
ఏప్రిల్ 24 న ఆంగ్ల పత్రిక ‘ద హిందూ’లో ఇసుక కొరత గురించి వచ్చిన కథనం సారాంశం.
ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలపై ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించడంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచులు మూసివేశారు.
నాలుగు వేల రూపాయలకు దొరికే ట్రక్కు ఇసుక పదిహేను వేల రూపాయల ధర పలుకుతోంది. అది చెల్లించడానికి సిద్దపడుతున్నా కూడా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలకు రోజుకి కనీసం 750 నుంచి 1000 లారీల ఇసుక అవసరం ఉండగా – ‘ఎన్జీటీ’ జరిమానా విధించగానే ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇసుక రీచుల్ని ప్రభుత్వం మూసివేసింది.
ప్రయివేటు నిర్మాణాలు మాత్రమే కాదు, ఇసుక కొరత కారణంగా ప్రభుత్వ నిర్మాణాలు కూడా నెమ్మదించాయి.
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా తీసుకురావాలనే దాని గురించి ప్రణాళికలు సిద్ధం చేశారేమోనని అనిపించకమానదు.