iDreamPost
iDreamPost
స్టార్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ సరిగా రాక అలో లక్ష్మణా అంటున్న పరిస్థితుల్లో ఇద్దరు మీడియం రేంజ్ హీరోయిన్లతో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయడమంటే సాహసమే. అందులోనూ నివేదా థామస్, రెజీనాలు భారీ ఫాలోయింగ్ ఉన్న కథానాయికలు కాదు. టీమ్ ప్రమోషన్లు గట్టిగా చేయడంతో ఇదుందన్న సంగతి జనానికి తెలిసింది. స్వామిరారా లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం రవితేజతో రావణాసుర చేస్తున్న సుధీర్ వర్మ దీనికి దర్శకుడు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు తదితరాల టైంలో ఈయన పెద్దగా కనిపించలేదు. సురేష్ సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ఈ శాకినీ డాకినీ ఉన్న తక్కువ అంచనాలను దాటేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూసేద్దాం
పోలీస్ అకాడెమిలో శిక్షణ కోసం చేరిన షాలిని(నివేదా థామస్), దామిని(రెజీనా)లవి పూర్తి విరుద్ధమైన మనస్తత్వాలు కావడంతో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఈ కారణంగానే తరుచూ గొడవపడుతూ ఉంటారు. ఓ సందర్భంలో తమ కళ్లెదుటే మాఫియా గ్యాంగ్ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. రక్షించేందుకు విఫలయత్నం చేసినా లాభముండదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అంతగా పట్టించుకోకపోవడంతో వీళ్ళే స్వయంగా రంగంలో దిగుతారు. కానీ దీని వెనుక తాము ఊహించనంత పెద్ద నెట్ వర్క్ ఉందని అర్థమవుతుంది. ఉప్పు నిప్పులా ఉండే ఈ జంట ఈ కార్యం కోసం చేతులు కలుపుతారు. చివరికి ఎలా గెలిచారనేదే స్టోరీ.
మంచి ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ అండగా టేకాఫ్ ని పర్లేదనిపించేలా మొదలుపెట్టిన దర్శకుడు సుధీర్ వర్మ కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ని తెలుగీకరించడం వరకు బాగానే చేసినా అసలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో చేతులెత్తేశారు. ఏ మాత్రం ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లేతో చాలా సన్నివేశాలు నిస్సారంగా సాగుతాయి. కోర్ ప్లాట్ కి సంబంధించిన ఎమోషన్ కి సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో ఇలాంటి జానర్ ని విపరీతంగా ఇష్టపడే ఆడియెన్స్ కి సైతం అసంతృప్తి కలుగుతుంది. లాజిక్స్ లేకుండా సీన్లు పరిగెత్తడం మరో మైనస్. నివేదా రెజీనాలు తమ బెస్ట్ ఇచ్చినప్పటికీ స్క్రిప్ట్ లో లోపం వల్ల వాళ్ళ కష్టం వృధా అయ్యిందనే చెప్పాలి. సంగీతం కూడా సోసోనే. ఓటిటిలో చూసేందుకు ఓకే కానీ ఇలాంటి కంటెంట్ థియేటర్లో కష్టమే