Idream media
Idream media
జమ్మలమడుగు రాజకీయం కొలిక్కి వచ్చింది. ఏడాదిగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఆ పార్టీ అధిష్టానం ముగింపు పలికింది. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సేవలు మండలిలో వినియోగించుకుంటామని తెలిపారు.
2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో జమ్మలమడుగు నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి 50 వేల పైచిలుకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి పై గెలుపొందారు. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పని తాను చేసుకుపోతు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. గతేడాది మార్చిలో రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి అధికార వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పీఆర్ రాకను అప్పట్లో సుధీర్ రెడ్డి వ్యతిరేకించినా, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం సూచనల మేరకు సుధీర్ రెడ్డి స్వాగతించాల్సి వచ్చింది. పీఆర్ వచ్చింది మొదలు.. నియోజకవర్గంలో వ్యతిరేక ప్రచారం చేయడం మొదలు పెట్టారు. పీఆర్, సుధీర్ రెడ్డి కి తీవ్ర విబేధాలు ఉన్నాయని, ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని తప్పుడు కథనాలు వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ప్రచారం వెనక మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి ఉన్నారని నియోజకవర్గంలోని ప్రజలు మాట్లాడుకునే వారు.
ఇలాంటి ప్రచారానికి స్వస్తి చెప్పాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని పీఆర్ కలిశారు. సీఎం సూచనల మేరకు 2023లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు కలిసి పని చేసి, పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ 2024లో నియోజకవర్గ పునర్విభజన జరిగి, అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామని చెప్పడంతో పీఆర్ వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది.
నాయకత్వ లేమి నుంచి… బంపర్ మెజారిటీ వరకు
హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చలామణవుతూ, పార్టీ అధినేత జగన్ మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆది నారాయణ రెడ్డి కి అప్పటి సీఎం చంద్రబాబు రూపంలో చక్కని అవకాశం దొరికింది. అప్పటివరకు వైఎస్సార్ సీపీ కాడి మోస్తూ వచ్చిన ఆది ఉన్నపళంగా దాన్ని వదిలేసి టీడీపీ లోకి జంప్ అయ్యారు. తనతో పాటు క్యాడర్ మొత్తాన్ని తీసుకెళ్లిపోయాడు. కనుచూపు మేరలో చూసిన వైఎస్ఆర్ సీపీ కి నాయకుడు అనే వాడే లేకుండా పోయాడు. సరిగ్గా అలాంటి సమయంలో తానున్నానని మూలే సుధీర్ రెడ్డి ముందుకొచ్చాడు.
చెల్లాచెదురైన కార్యకర్తలకు తానున్నానని భరోసా నిస్తూ పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను బలంగా జనంలోకి తీసుకెళ్లారు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఒక్కో మండలంలో వైఎస్సార్ సీపీ కి క్యాడర్ ని తయారుచేశాడు. మూడేళ్ల పాటు ప్రతీ రోజు అవిశ్రాంతంగా పల్లె పల్లెకూ, వీధి వీధికి తిరుగుతూ జనానికి దగ్గరయ్యారు. అప్పటి వరకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను చూసిన ప్రజలకు సుధీర్ రెడ్డి ఒక ఆశాజ్యోతిలా కనిపించాడు. ఎంపీ అవినాష్ రెడ్డి సహకారంతో దేవగుడి పల్లెల్లోకీ అడుగుపెట్టాడు. అప్పటి మంత్రి ఆదితో ఢీ అంటే ఢీ అంటూ ముందుకు కదిలాడు.
అధికారం లేదు … ఒకరు మంత్రి, మరొకరు మాజీ మంత్రి(పీఆర్)… ఇద్దరిని ఎదురిస్తూ వైఎస్సార్ సీపీ కి బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆ ఇద్దరికి తానే ప్రత్యామ్నాయమని … దివంగత మహానేత వైఎస్సార్ రుణం తీర్చు కోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఆది, పీఆర్ లకు బుద్ధి చెప్పి జగన్ అన్నకి జమ్మలమడుగుని గెలిపించి కానుకగా ఇద్దామని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. మూడేళ్ల పాటు నియోజకవర్గాన్ని చుట్టేయడంతో సాధారణంగానే సుధీర్ రెడ్డి వైపు ఓటర్లు మొగ్గారు.