Idream media
Idream media
జాతరలో మనమెందుకు ఉత్సాహంగా, సరదాగా ఉంటామంటే మన చుట్టూ వేల మంది ఉన్నారనే సంతోషం. కరోనాతో మానవ సమూహమే ఆరడుగుల దూరం తొలగిపోయింది.
సంవత్సర కాలం తర్వాత ఒక పండుగ వాతావరణం చూశాను. ఫ్లోరిడాలోని సెయింట్ అగస్టినాకి ఆదివారం రాత్రి వెళ్లాం. కొత్త పెళ్లి కూతురిలా ఆ పట్టణం అలంకరించుకుని వుంది. క్రిస్మస్ సంబరాలకు ఆరంభం. ప్రతి రెస్టారెంట్, ప్రతి భవనం రంగురంగుల లైట్లతో వెలుగుతూ వుంది. దాదాపు 10 వేల మంది , ఎటు చూసినా జనమే. మానవ ముఖాలకే మొహం వాచిపోయినట్టు వచ్చేశారు. ఎవరికీ మాస్కులు లేవు, కరోనాని జయించేసినంత ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.
పసిపిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీ దగ్గర ఫొటోలు తీసుకుంటున్నారు. ఓపెన్ ఎయిర్ బస్సులు జనాలతో తిరుగుతుంటే పెద్దగా పాటలు పాడుతున్నారు. పోగొట్టుకున్న సంబరం జుర్రుకుంటున్నారు. ఎడారి నుంచి వచ్చిన మనుషుల్లా దాహం తీర్చుకుంటున్నారు.
ఒక అబ్బాయి చేతిలో గులాబీతో వినమ్రంగా ఒక అమ్మాయికి propose చేశాడు. సిగ్గుతో అంగీకరించింది. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చప్పట్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీశారు. అద్భుతమైన దృశ్యం. ఆ ప్రేమికులెవరో తెలియదు, ఏ దేశమో తెలియదు. ఆ ముచ్చట చూసి అందరి కళ్లలో మెరుపు. ప్రేమ గొప్పతనమది.
మనం చూస్తే ప్రేమకి మతాన్ని పూసి గాయపరిచి చట్టాలు చేయాలని చూస్తున్నాం. పార్కులో ప్రేమికులు కనపడితే కర్రలతో బాదే కాలంలోకి ప్రయాణిస్తున్నాం.
తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్లు బీర్లు, వైన్ లాగిస్తున్నారు. పిజ్జా షాప్ ముందు పెద్ద క్యూ వుంది. చిన్న కుక్కలు, పెద్ద కుక్కలు ఎదురు పడినప్పుడు బెల్ట్‌ను లాగుతూ ఒకరి మీద ఒకరు దూకడానికి ప్రయత్నిస్తున్నాయి.
దేవుడి గొప్పతనాన్ని ఒక ప్లకార్డులో వివరిస్తూ ఒకాయన అదృష్టం ప్లేయింగ్ కార్డ్ అమ్ముతున్నాడు. మన దేశంలో తాయెత్తులు అమ్మినట్టు!
ఆశ్చర్యంగా వీధిలో పిల్లల బొమ్మలు అమ్మేవాళ్లు ఒకరిద్దరు కనిపించారు. మన దగ్గరైతే రకరకాల వస్తువుల్ని అమ్ముతూ కొన్ని వందల మంది కనిపించేవాళ్లు. ఇక్కడ వీధి వ్యాపారుల్ని లేకుండా చేశారు.
అమెరికా తరహా అభివృద్ధి అంటే స్వయం ఉపాధి లేకుండా చేయడం. డబ్బులుంటే పెద్ద దుకాణం పెట్టుకో. లేదంటే ఆ దుకాణంలో కూలివాడుగా మారిపో.
ఇండియాలో 75 లక్షల కోట్ల రూపాయల రిటైల్ మార్కెట్‌పై ప్రపంచ యుద్ధం జరుగుతోంది. రిలయన్స్, వాల్‌మార్ట్, అమెజాన్, ఆదిత్యబిర్లా తుపాకులు ఎక్కు పెట్టారు. కాకపోతే వాటిని మన భుజాలపై పెట్టి కాలుస్తారు. వాళ్లకేం కాదు. బుల్లెట్ ప్రూప్ జాకెట్లు వుంటాయి. గాయాలు మనకి. మోడీ ప్రభుత్వం ఉచిత బ్యాండేజీ సరఫరా చేస్తుంది.
చిన్న వ్యాపారులే కాదు, చిన్న రైతులు కూడా వుండకుండా చేయాలనేదే అభివృద్ధి. మన అదృష్టం ఏమంటే నిరక్షరాస్యత, పేదరికమే మన ఆయుధాలు. ఏ పూటకి ఆ పూట ఉప్పు చింతపండు కొనేవాళ్లు వున్నంత కాలం రిటైల్ మార్కెట్ వుంటుంది. అర ఎకరా, ఎకరా పొలంలో కూరగాయలు పండించే రైతులకి చట్టాలు అర్థం కావు. డైనోసార్లు తినాలనుకున్నా చీమల్ని అంత సులభంగా తినలేవు. డైనోసార్ గాయపడితే చీమల చేతిలో ఫినిష్ అయిపోతుంది.