iDreamPost
android-app
ios-app

శప్తభూమి….కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

  • Published Dec 18, 2019 | 1:19 PM Updated Updated Dec 18, 2019 | 1:19 PM
శప్తభూమి….కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

గత రెండేళ్లుగా ఈ శప్తభూమి మీద వచ్చిన రివ్యూస్ మరే నవలకూ వచ్చి ఉండవు.సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంలో రచయిత,రాయలసీమ ఉద్యమకారుడు బండి నారాయణ స్వామి గారికి అభినందనలు.బహుశా ఈ నవల తొలి పరిచయం నాదే అనుకుంటా…

పుస్తక రివ్యూ

ఎవరైనా సత్పురుషుడు సత్సంకల్పంతో నిరాహారంగా దేవుడిని వేడుకుంటే వానలు కురిపిస్తాడని మా అమ్మ చెప్పేది….ఫొర్జరీ నేరం మీద జైలుపాలై తనవాళ్లను చూడటానికి మొహం చెల్లక ఒక గ్రామం చేరి గుడి పంచన చేరిన రాజు చెప్పిన మాటలవి…ఇంకేముంది..విన్న గ్రామస్తుడు రాజునే నిరాహార వ్రతం పట్టబోతున్నాడని ప్రచారం చేసాడు..బలవంత దీక్ష..ఉండాలా?పారిపోవాలా?

చివరికి పరివర్తన…”న సుఖ్ హై,న దుఖ్ హై…న దీన్ హై,న దునియ,న ఇన్సాన్,న భగవాన్..సిర్ఫ్ మై హూన్..మైహూ…” అనే అద్వైత సిద్ధి పొందుతాడు…ఇది ఆర్కే.నారాయణ్/దేవ్ఆనంద్ “గైడ్”.

వర్షం…చెరువులు నిండేలా,కరువు తీరేలా రావాలి…టిప్పు సుల్తాన్ కు కట్టవలసిన కప్పం కట్టాలి,లేకుంటే వారి అనంతపురం కోట కు బీగాలు/తాళాలు వేసి స్వాధీనం చేసుకుంటారు…

అమరనాయకుడు ఎల్లప్ప జెట్టి వర్షం కోసం ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు..శ్రీశైలం లో వీరమంటపం ఎక్కడానికి సిద్ధమయ్యాడు…

శ్రీశైలం ప్రయాణం మొదలైంది…వీరమంటపం ఎక్కబోతున్న వీరుడిని చూసి జనావాసాలు చిందులేసాయి..చివరికి మండపం దగ్గర శైవగమ మంత్రదీక్షా నిర్వాహకుడు గండకత్తెరతో వచ్చాడు…ఎల్లప్పజెట్టి సంకల్పం అడిగాడు..గండకత్తెర అందించాడు…కాళ్లు నరుక్కున్న తర్వాత శివాగమ దీక్షాపరుడు గండకత్తెర తీసుకుని మరిన్ని అంగాలను నరికి అష్టభైరవౌలకు అర్పించాడు…

భీకర క్రతువు ముగిసింది..అనంతపురం ఆకాశంలో ఫెళఫెళా ఉరుములు ఉరిమినాయి,ధగధగా మెరుపులు మెరిసినాయి…

ఇంతకూ ఎల్లప్పజెట్టి సంకల్పం నెరవేరిందా?

ఎల్లప్పజెట్టి ఎవరా?గొర్రెలను కాచుకునే కురవ యువకుడు…ఎప్పుడో ముసలమ్మ త్యాగానికి గుర్తుగా ఉన్న చెరువు కట్టను తెంచాలనుకున్న దుండగులను పట్టుకుని రాజాశ్రయం పొంది అమరనాయకుడైనాడు…ఆ తర్వాత మరదలు ఇమ్మడమ్మను పెళ్లాడాడు..కానీ ఆవిడకు మరో మామ కొడుకు కోడెనీలడు మీద మనసు…నీళ్లుదొరకని పాడుపల్లెకు పిల్లనివ్వాలా అని ఎల్లప్పజెట్టి దగ్గర ఓలి తీసుకుని మరీ పిల్లనిచ్చారు..వాళ్లు మాత్రం ఏం చెయ్యగలరు అప్పటికే కరువుబారిన పడి ఒక పిల్లను అనంతపురం పాలకుడు హండే సిద్ధరామప్ప నాయుడి ఇష్టసఖి,దేవదాసి పద్మసానికి అమ్ముకున్నారు…

ఇమ్మడమ్మ ఇష్టం లేని కాపురం చేసిందా?ఊహూ..ఆ తర్వాత ఏడుసార్లు చీరకట్టించుకుంది(మారుమనువు)…ఇక ఆమె వలచిన కోడెనీలడు “గాలిదేవర” అయ్యాడు…

గ్రామాల్లో దేవరలు/జాతర జరిగినప్పుడు ఆ గ్రామం వారు సంపదగా భావించే పొలి ని కానీ,ఇతర పూజావస్తువులను కానీ దొంగిలించి తమగ్రామానికి తీసుకువెళ్లే వారు…దేవర జరిగే గ్రామం వారు వీళ్లను వేటాడీ మరీ చంపవచ్చు..ఈ వేట గాలిదేవర తన గ్రామ పొలిమేర చేరేంతవరకే…
ఈ పాత్రలే కాదు…
చెరువు తవ్వించి గ్రామాన్ని ఏర్పరచిన దేవదాసి పద్మసాని…
కుల వివక్ష భరించలేక చెన్నపట్నం చేరి ఇంగ్లిష్ చదువులు చదివి మతం మారిన పద్మసాని కొడుకు మనారుదాసు..
గుడిలో పూజల పేర అర్చకుడి లైంగిక దోపిడీ…
సతీసహగమన దురాచారాలు…
ముక్కుపచ్చలారని పిల్లలను బసివి/జోగినులుగా మార్చే దురాచారం…
నాటి భయంకర శిక్షలు…
గ్రామం లో సాముగరిడీల్లో పాల్గొనే అవకాశం లేక అర్ధరాత్రి దొంగగా వచ్చి ఎవరూ ఎత్తటానికి సాహసించని పెనుశిలను ఎత్తి దొరికిపోయి అవమానాలపాలై చివరికి దారిదోపిడీదారుగా మారిన కంబళి శరభుడు….
ఏనాటి దురాచారమో..కొత్తగా పెళ్లైన దళిత దంపతులు గుండు చేయించుకుని సున్నంబొట్లు పెట్టుకునే జాతర..దాన్ని నిరసించి పారిపోయి వీరశైవ మథాల్లో పెరిగి దళితవాడల్లో సంఘసంస్కరణకు వచ్చిన నిడిమానుస్వామి…
రాయలసీమలో ఎన్నోచోట్ల కనిపించే అవధూతలు..

తండ్రిని వధించిన వ్యక్తితో మల్లయుద్ధం చేసి గెలిచి అప్పటికే లుప్తమైన “రణకుడుపు” ఆచారం పాటించిన వీరనారి హరియక్క…
దోపిడీ బారి నుంచి గ్రామాన్ని కాపాడి వీరగల్లు గా మారిన మంగలి గంగన్న,పేరంటాలైన అతని భార్య గైరమ్మ….

ఒకరా..ఇద్దరా…ఎందరెందరో…కొన్ని మాయం కాగా ఇంకా కొనసాగుతున్న మా ఆచారాలు,సంప్రదాయాలు..
విజయనగరసామ్రాజ్య పతనానంతరం ఒక పక్క హైదర్ అలి,మరో పక్క కుంఫిణీ ప్రభుత్వం..మరో పక్క పీష్వాల దాడులు…ఉన్నవాళ్లు సరిపోక థగ్గుల దోపిడీల సంక్షుభిత కాలం నేపధ్యంగా వచ్చిన నవల బండినారాయణ స్వామి “శప్తభూమి”…
నిజంగా మా సీమ శప్తభూమేనా?ఏమో….
ఏదైతేనేం…Come fall in love with Rayalaseema..