Idream media
Idream media
వన్డే క్రికెట్ చరిత్రలో మార్చి 31 ఒక ప్రత్యేకమైన రోజు.అప్పటి వరకూ ఏ బ్యాట్స్‌మన్ సాధించని అరుదైన రికార్డును తొలిసారి ఒక భారత క్రికెటర్ సాధించిన రోజు.సరిగ్గా ఇదే రోజు 2001లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పదివేల పరుగులను సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించాడు.
సచిన్ తర్వాత వన్డేలలో 13 మంది పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. అయితే భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన 205 ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా ఈ పదివేల పరుగుల ఘనతను సాధించాడు.2018 అక్టోబర్ 24న విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 129 బంతుల్లో అజేయంగా 157 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసి సచిన్ (259 ఇన్నింగ్స్) రికార్డును కోహ్లీ అధిగమించాడు.
ఆనాటి ఇండోర్ వన్డే విశేషాలు:
ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 125 బంతుల్లో 19 ఫోర్లు కొట్టి 139 పరుగులు చేశాడు.హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ 88 బంతులలో 83 పరుగులు సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆసీస్ ఓపెనర్ గిల్ క్రిస్ట్ ఒక్కడే బ్యాటింగ్‌లో 70 బంతులలో 63 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు రాణించక పోవడంతో 35.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 118 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.భారత బౌలర్లలో అగార్కర్,హర్భజన్ సింగ్ చెరో మూడు వికెట్లు తీసుకొని ఆసీస్ ఓటమిని నిర్దేశించారు.