iDreamPost
iDreamPost
ఏపీలో కీలకమైన నగరాల్లో విశాఖదే ప్రథమ స్థానం. ఇప్పుడు మరో కీలక స్థాయికి ఈ నగరం చేరుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉన్న బీచ్‌లలో విశాఖకు చెందిన రుషికొండ బీచ్ స్థానం దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా 8 బీచ్‌లకు ఈ గుర్తింపు లభించగా, అందులో ఒకటి రుషికొండ.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా ఉండడం, పరిశుభ్రత, రసాయన రహితంగా ఉండడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ బ్లూప్లాగ్ సర్టిఫికెట్‌ను ప్రకటిస్తోంది. ఈ సర్టిఫికెట్ రుషికొండకు వచ్చింది. అలాగే ఒడిస్సాలోని గోల్డెన్‌బీచ్, అండమాన్‌లోని రాధానగర్‌బీచ్, కేరళలోని కప్పడ్‌బీచ్, కర్నాటకలోని పదుబిద్రిబీచ్, కార్‌కోడ్‌బీచ్‌లు డయ్యూలోని ఘోగ్లాబీచ్, గుజరాత్‌లోని శివరాజ్‌పూర్ బీచ్‌లకు బ్లూప్లాగ్ సర్టిఫికెట్ లభించింది.
ఈ హోదా వల్ల లాభం ఏమిటి..?
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తాము బీచ్‌లను సందర్శించాలనుకుంటూ ముందుగా బ్లూప్లాగ్ సర్టిఫికెట్ ఉన్న బీచ్‌లను ఎంపిక చేసుకుంటారు. దీని ద్వారా ఆయా బీచ్‌లలో ఉండే ప్రమాణాలపై అంతర్జాతీయంగా ఒక అంచనా ఏర్పడుతుంది. దీంతో ఆయా బీచ్‌లకు విదేశీ పర్యాటకుల రాకపెరుగుతుందంటున్నారు.
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఇన్ని బీచ్‌లకు బ్లూప్లాగ్ సర్టిపికెట్ రావడం ఇదే మొదటి సారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌జయదేకర్ తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి బీచ్‌లను మరినిన అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో ఉన్న బీచ్‌లలో సదుపాయాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.