INR vs USD కొత్త రికార్డు కనిష్ట స్థాయి 80కి పడిపోయిన రూపాయి, ఇది మిమ్మ‌ల్ని ఎలా ప్ర‌భావితం చేస్తుందంటే?

అనుకున్నంతా అయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయికి పతనమై రూ. 80 మార్క్ తాకింది. కొన్ని రోజులుగా 79.90పై ట్రేడవుతున్న రూపాయి విలువ మంగళవారానికి 80 దాటింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది 82కు పడిపోవచ్చన్న‌ది విశ్లేషకుల అంచనా. అయితే కొంద‌రు విలువ 79కే పరిమితం కావచ్చని విశ్లేషిస్తున్నారు. 2029 నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 94 లేదా 95కి పడిపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా వేస్తోంది. బ‌హుశా ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న‌ది ఆర్ధిక‌వేత్త‌ల భ‌యం.

2014లో NDA కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూపాయి విలువ 25 శాతం క్షీణించింది. 2014 డిసెంబర్ 31 నాటికి రూపాయి మారకపు విలువ 63.33 కాగా 2022 జూలై నాటికి 79.41కి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 7 శాతం మేర ప‌త‌న‌మైంది. ఈ సంగ‌తిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించారు.

ఎందుకిలా?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాల వల్ల బ్యారెల్ ముడి చమురు ధర వంద డాలర్లు దాటింది. దీంతో చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోతోంది. ఇది మన కరెంట్ ఖాతా లోటుపై (CAD) తీవ్ర ప్రభావం చూపుతోంది. మన ఎగుమతులకు డిమాండ్ తగ్గి దిగుమతులు పెరడగం వల్ల వాణిజ్య అంతరం (Trade Gap) తీవ్రమైంది.

అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి అమెరికన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో పెంచుతున్నాయి. దీంతో డాలర్ విలువ కూడా పెరుగుతూ పోతోంది. ఇన్వెస్టర్లు సహజంగా అటువైపై మొగ్గు చూపుతారు. ఈ ప్రభావం భారత్ తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్నదేశాలపైనా పడుతోంది. రూపాయి పతనానికి ఇదో కారణం.

ఏం జరగబోతోంది?

మొబైల్ లాంటి ఇంపోర్టెడ్ వస్తువులు, విడి భాగాల ధరలు పెరిగే అవకాశముంది. ఉక్కు పరిశ్రమలో ముడి పదార్థాల ధరలు పెరగవచ్చు. బొగ్గు దిగుమతులు ఖరీదు కావచ్చు. వైద్య పరికరాల ధరలూ పెరిగే అవకాశముంది.

అయితే డాలర్ల రూపంలో ఆదాయాన్ని రాబట్టే ఐ.టి. పరిశ్రమలకు ఇది సానుకూల పరిణామమే.

మ‌రి రూపాయి ప‌త‌నాన్ని అడ్డుకొనెదెలా?

ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించేలా, ఒక శాశ్వత విధానాన్ని తీసుకురావాలి. ముడి చమురుపైనే పూర్తిగా ఆధారపడకుండా సోలార్, విండ్ పవర్, బయో ఫ్యుయెల్ లాంటి ఇతర పునరుత్పాదక ఇంధన రంగాలను మెరుగుపరుచుకోవాలి. బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచడమే కాదు దిగుమతుల పరిణామంపైనా ఆంక్షలు విధించాలి.

రూపాయిని బలోపేతం చేయడానికి బాహ్య వాణిజ్య రుణాలు (ECB) మరో మార్గం. వీటి షరతులను సడలించడం ద్వారా ఫారిన్ ఎక్స్ చేంజ్ ఇన్ ఫ్లో పెంచవచ్చు. RBI ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ECB రుణ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించింది.

భారత్ తన మార్కెట్ ను మరింత విస్తృతపరుచుకోవాలి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అభివృద్ధి, తక్కువ వడ్డీ రేట్ల లాంటి చర్యల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దీంతో మన రూపాయి బలోపేతమయ్యే అవకాశముంది.

Show comments