iDreamPost
android-app
ios-app

తాజాదనం వెనుక కనిపించని శ్రమ

తాజాదనం వెనుక కనిపించని శ్రమ

మనిషి వ్యక్తిగతంగా ప్రపంచం మొత్తం బాగుంది నేను మాత్రమే కష్టాలు పడుతున్నానని బాధపడుతుంటాడు. తనకొచ్చే ప్రతి కష్టానికి ఎవరో ఒకరిని లేదా ఏదోక దాన్ని నిందిస్తుంటాడు.అయితే అవన్నీ కష్టాలేనా(!?)పరిష్కారం దొరికే ఏ సమస్య అయినా కష్టం కాజాలదు.అయితే మనిషి పరిష్కరించుకోలేని సమస్యలను మనకు మనంగా ఏర్పరుచుకున్న వ్యవస్థ సృష్టిస్తే?కారణం ఏదైనా కానీ,దాని పర్యావసనాలను అనుభవించాల్సింది మాత్రం సాధారణ ప్రజానికమే…తెలంగాణలో ఆర్టీసి సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ఆకుకూరలు పండించే రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

రిలయెన్స్ ఫ్రెష్ కి వెళ్ళామా..తాజాతాజాగా ఉన్న ఆకుకూరలను కొనుగోలు చేసామా..మన ఆరోగ్యాలు పాడవ్వకుండా ఆ పంటలు ఏ రసాయనాలు వాడని ఆర్గానిక్ అయితేనో లేదా తక్కువ మోతాదులో మంచిదని మనకు తెలుసు.కానీ మన ఆరోగ్యాలను కాపాడే ఆ ఆకుకూరల వెనక ఎంతో మంది మహిళ రైతుల శ్రమ ఉంటుందని గానీ వారి జీవితాలు ఆ ఆకుకూరలతోనే ముడివేసుకుని ఉంటాయని గానీ ఎంత మందికి తెలుసు.

రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో ఆకు కూరలు పండించే రైతు కుటుంబానికి చెందిన మహిళలతో మాట్లాడినప్పుడు  వారి కష్టాలు వింటుంటే వ్యవస్థ తాలూకు దుర్మార్గపు కోణం మరింత దారుణంగా కళ్ళముందు సాక్షాత్కరించింది.సాధారణంగా ఆకుకూరలు పండించే రైతు కుటుంబాలలో సరుకును మార్కెట్ కి చేర్చే బాధ్యతను మహిళలే నిర్వహిస్తుంటారు.పచ్చి సరుకు కావడం మూలానా వేకువజాము వరకే సరుకు మార్కెట్లో ఉండాలి.ఇంటిబాధ్యతలు నేరవేర్చుకుని,సకాలంలో సరుకు మార్కెట్ కి చేర్చడం కోసం ఆ మహిళలు ఉదయం మూడింటి నుండే పనిలో పడతారు.అయితే ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సకాలంలో సరుకును మార్కెట్ కి చేర్చలేక,ఇంటిబాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేక చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు.

ఆకుకూరలు పండించే కు ఆకుకూరలు వర్షాభావ పంటలు కావు.దానికి ఖచ్చితంగా నీటి వనరులు ఉండాలి.కాబట్టి ఆకుకూరలు పండించాలనుకునే రైతులకు పుష్కలంగా నీటి వనరులు సమకూర్చుకోవడం,చీడపీడలు,పెర్టిలైజర్స్ పై అవగాహన కలిగి ఉండడం ఒక ఎత్తయితే…సకాలంలో పంటను కోయడం,కోసిన పంటను కట్టలు కట్టడం మరో ఎత్తు.పంటను కోయడం,కట్టలు కట్టడం,మార్కెట్ కి చేర్చడం అంతా ఒక రాత్రిలో జరిగిపోవాలి.ఇందులో ఏ ఒక్కచోట అవకతవకలు జరిగిన పంట చేతికి రాదు.పోని చచ్చిచెడి ఆర్టీసి బస్సుల్లో ఇన్నేసి కష్టాలకోర్చి పంటను మార్కెట్ కి చేర్చినా…దళారుల చేతిలో మోసపోకతప్పదు.అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అన్న ధోరణి కొనుగోలు దారులకు విడమర్చి చెప్పనవసరం లేదుగా…అయితే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతులకు పై అలవాటు పడిన కష్టాలకు అదనంగా మరో పెద్ద కష్టం ఆర్టీసీ సమ్మె రూపంలో వచ్చిపడింది.

సాధారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ఆకుకూరల రైతులంతా ఆర్టీసీ బస్సుల్లోనే సరుకును మార్కెట్లోకి చేరుస్తారు.సరుకు మార్కెట్ కి చేర్చడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా గిట్టుబాటు ధరలు పలకవు.సమ్మె కారణంగా సకాలంలో బస్సులు లేకపోవడం వలన ప్రైవేటు వెహికిల్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది.ఇదే అదునుగా ప్రైవేట్ బండ్ల యాజమానులు మామూలు చార్జీల కంటే రెట్టింపు అదనంగా వసూళ్లు చేస్తున్నారు.అన్ని ఖర్చులు లెక్కవేస్తే పెట్టుబడికి,లాభాలకు ఏ మాత్రం పొంతన లేకుండా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.ఈ ఆకుకూరలనే నమ్ముకుని బతికే రైతు కుటుంబాలు దిక్కతోచని స్థితిలో కుట్టుమిట్టాడుతున్నాయి.మరి వీరి కష్టాలు ఎప్పటికి తీరేనో వేచిచూడాలి.

–శతపత్ర మంజరి