Krishna Kowshik
Krishna Kowshik
‘అదృష్టం తలుపు తట్టే లోగా, దరిద్రం లిప్ లాక్ పెట్టింది’ అని ఓ సినిమాలో కమెడియన్ అన్నట్లుగా ఈ క్యాబ్ డ్రైవర్ విషయంలో అక్షర సత్యం అయ్యింది. కలలో కూడా ఊహించని విధంగా అతని ఖాతాలో వేలకోట్లు వచ్చి పడ్డాయి. ఆ నంబరు లెక్క వేసుకునే సరికి అతడికి చాలా సమయం పట్టి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో డబ్బులను తన ఖాతాలో చూసి ఆశ్చర్యపోయేలోగా బ్యాంకు సిబ్బంది అతనికి పెద్ద షాక్ నిచ్చారు. దీంతో నిమిషంలోనే కోటీశ్వరుడైన డ్రైవర్.. అర నిమిషంలో తిరిగి సామాన్యుడిగా మారాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పళని నెయ్‌క్కార పట్టి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అద్దెకు కారు తీసుకుని నడుపుకుంటున్నాడు.
ఈ నెల 9న యథావిధిగా డ్యూటీకి వెళ్లిన రాజ్ కుమార్ మధ్యాహ్నం కారులో కాస్త కునుకుపాట్లు పడుతుండగా.. అతని సెల్ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. ఏంటా అని తీసి చూసేసరికి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుండి అతడి ఖాతాకు రూ. 9 వేల కోట్లు జమ అయ్యినట్లు మేసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిద్ర మత్తు ఎగిరిపోయింది. మరోసారి కళ్లు తుడుచుకుని ఆ నెంబర్లను లెక్క వేయగా.. వేల కోట్ల కోట్ల రూపాయలు అని తెలిసి గుడ్లు తేలేయడం అతని వంతైంది. అప్పటి వరకు అతడి ఖాతాలో కేవలం రూ. 105 మాత్రమే ఉన్నాయి. ఇది నిజమా కలా అని తెలుసుకునేందుకు తన స్నేహితుడు ఖాతాకు రూ. 21 వేల బదిలీ చేశాడు. తన ఖాతాలో డబ్బులు పడిన మాట వాస్తవమే అని గ్రహించి.. సంబరపడిపోయాడు.
అంతలోనే అతడి ఆనందాన్ని, అదృష్టాన్ని ఆవిరి చేస్తూ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుండి రాజ్ కుమార్‌కు ఫోన్ వచ్చింది. పొరపాటు వల్ల ఆ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని, ఆ డబ్బును ఖర్చు చేయవద్దని బ్యాంకు యాజమాన్యం కోరింది. అనంతరం అతడి ఖాతా నుండి మొత్తం నగదును వెనక్కు తీసుకుంది. స్నేహితుడికి పంపిన డబ్బులను కూడా తిరిగి చెల్లించాలని అతడికి సూచించింది. దీంతో అతడికి ఏం చేయాలో తోచక లాయర్లను ఆశ్రయించాడు. కాగా, రాజ్ కుమార్ తరఫున న్యాయవాదులు చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు వెళ్లి మాట్లాడారు. రూ. 21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం కూడా ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.