iDreamPost
android-app
ios-app

రొటీన్ క‌థ‌, రికార్డ్ క‌లెక్ష‌న్ల సోగ్గాడు – Nostalgia

రొటీన్ క‌థ‌, రికార్డ్ క‌లెక్ష‌న్ల సోగ్గాడు – Nostalgia

1975 డిసెంబ‌ర్‌లో వ‌చ్చిన సోగ్గాడు రొటీన్ ఇద్ద‌రు హీరోయిన్లు, ఒక హీరో క‌థ‌. కానీ క‌లెక్ష‌న్లు మాత్రం అన్ని రికార్డులు చెదిరిపోయాయి. ఈ సినిమా దూకుడు ఏ స్థాయి అంటే 1976 జ‌న‌వ‌రి సంక్రాంతికి కూడా ఇదే నెంబ‌ర్ వ‌న్‌. 75 నాటికి శోభ‌న్‌బాబు స్పీడ్ ఒక రేంజ్‌లో ఉంది. అంద‌రూ మంచి వారే, జీవ‌న జ్యోతి, దేవుడు చేసిన పెళ్లి వ‌రుస హిట్స్ త‌రువాత సోగ్గాడు వ‌చ్చింది.

అప్ప‌టి వ‌ర‌కు ఫ్యామిలీ హీరోగా ఉన్న శోభ‌న్‌కి ఒక ర‌కంగా ఇది యాక్ష‌న్ సినిమా. 1973లో వ‌చ్చిన మాయ‌దారి మ‌ల్లిగాడులో కృష్ణ ప‌ల్లెటూరి పొగ‌ర‌బోతుగా చేసి హిట్ కొట్టాడు. సోగ్గాడులో పొగ‌రు, అమాయ‌క‌త్వం, ధైర్యం అన్నీ క‌ల‌గ‌ల‌సిన క్యారెక్ట‌ర్‌లో శోభ‌న్ కొత్త‌గా క‌నిపించాడు.

దీనికి తోడు మ‌హ‌దేవ‌న్ సంగీతం సూప‌ర్‌హిట్‌. ఆరు పాట‌లూ మార్మోగిపోయాయి. జ‌య‌సుధ గ్లామ‌ర్ , జ‌య‌చిత్ర న‌ట‌న క‌లిసొచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు వాణిశ్రీ‌ని చూసిచూసి విసిగిపోయిన ప్రేక్ష‌కుల‌కి జ‌య‌సుధ రిలీఫ్ ఇచ్చింది.

బాల‌మురుగ‌న్ క‌థ అందించాడు. ప‌ల్లెటూర్లో వ్య‌వసాయం చేస్తున్న సోగ్గాడు మ‌ర‌ద‌లు స‌రోజ‌ను ప్రేమిస్తాడు. ఆమెకి కూడా ఇష్ట‌మే కానీ, తండ్రి అల్లు రామ‌లింగ‌య్య అడ్డుప‌డి చ‌దువు లేని వాడికి కూతురిని ఇవ్వ‌న‌ని అంటాడు. సోగ్గాడికి కోపం వ‌చ్చి అంత‌కంటే ఎక్కువ చ‌దివిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌ని శ‌ప‌థం చేస్తాడు. త‌ల్లి మాట జ‌వ‌దాట‌ని సోగ్గాడు, త‌ల్లికి కూడా చెప్ప‌కుండా ప‌ట్నం వెళ్తాడు.

ఇష్టం లేని పెళ్లి త‌ప్పించుకోడానికి ఇంట్లో నుంచి పారిపోయిన జ‌య‌చిత్ర రైళ్లో ప‌రిచ‌యం అవుతుంది. త‌ర్వాత అనుకోకుండా వాళ్లిద్ద‌రూ భార్యాభ‌ర్త‌ల‌వుతారు. స‌హ‌జంగానే విల‌న్ స‌త్య‌నారాయ‌ణ వాళ్ల‌ని విడ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే జ‌య‌సుధ త్యాగంతో వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌వుతారు. మురిగిపోయిన క‌థ‌నే బాల‌ముర‌గ‌న్ ఇచ్చాడు. అయితే ఎన్నో అంశాలు క‌లిసి వ‌చ్చి ఆ రోజుల్లో రెండు కోట్లు వ‌సూలు చేసింది. (ఈ రోజు విలువ వంద కోట్ల‌కు పైగా)

*సోగ్గాడు ప్ర‌త్యేక‌త ఏమంటే 70 శాతం సినిమా ఔట్‌డోర్‌లోనే తీశారు. కోన‌సీమ కొబ్బెరి తోట‌లు క‌నువిందు చేస్తూ ఉంటాయి.

*శోభ‌న్‌బాబుకి డ్యాన్స్‌లు చేయ‌డం చాలా ఇబ్బంది. డ్రిల్‌మాస్ట‌ర్‌లా చేతులు ఊపుతూ క‌నిపిస్తాడు.

*టి.సుబ్బ‌రామిరెడ్డి క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు

*క‌థ‌తో సంబంధం లేకుండా కామెడీ ట్రాక్‌లు అప్ప‌టి సినిమాల్లో త‌ప్ప‌ని స‌రి. భార్య ర‌మాప్ర‌భ‌ని అనుమానించే ఛీప్ కామెడీ రాజ‌బాబు చేశాడు.

*75లో ట్యాంక్‌బండ్ ఎలా ఉండేదో క‌నిపిస్తుంది.

*మంజుభార్గ‌వి వేశ్య పాత్ర వేసింది. త‌ర్వాత రోజుల్లో ఆమె శంక‌రాభ‌ర‌ణం అనే సూప‌ర్‌హిట్ మూవీలో హీరోయిన్‌గా చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అన్ని సినిమాల్లో క‌నిపించిన‌ట్టే నిర్మాత రామానాయుడు ఒక చిన్న సీన్‌లో క‌నిపిస్తాడు.

*ఫైట్స్‌లో శోభ‌న్ కంటే ఆయ‌న డూపే ఎక్కువ క‌నిపిస్తాడు.

*75 నాటికే ప‌ల్లెటూర్లో నుంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఒక సీన్‌లో ఇప్పుడు ప‌ల్లెల్లో ఎవ‌రుంటున్నారు, అంద‌రూ ప‌ట్నం వెళ్లిపోతున్నారు అనే డైలాగ్ ఉంది.

*పాట‌ల‌న్నీ ఆత్రేయ రాస్తే మాట‌లు మోదుపూరి జాన్స‌న్ రాశాడు. జాన్స‌న్ చాలా చిన్న వ‌య‌సులో హార్ట్ ఎటాక్‌తో పోయాడు.

*1975లో అంద‌రు హీరోలు క‌లిసి ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారో రాజ‌బాబు ఒక్క‌డే అంత‌కంటే ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేశాడు.

*అన్ని ఊళ్ల‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను సోగ్గాడు బ‌ద్ద‌లు కొట్టింది. మిర్యాల‌గూడ లాంటి చిన్న టౌన్లో కూడా తొలి సారిగా రెండు థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.