తెలుగులో కొత్త జానర్ ట్రై చేస్తున్నారంటే అది సాహసమనే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పటినుండో ఫైట్స్, పాటలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు కొత్త జానర్ ని అంగీకరిస్తారో లేదో అని నిర్మాతలు భయపడతారు.
కానీ ఒక రెండు నిమిషాల సైంటిఫిక్ సీన్ ని రూపొందించి మిగిలిన సినిమా మొత్తం రొటీన్ సన్నివేశాలతో నింపేస్తే అది కొత్త జానర్ ఎప్పటికీ కాలేదు. కొత్త పాయింట్ ని అద్భుతంగ చూపించడం మానేసి ఆ పాయింట్ ని రొటీన్ సన్నివేశాల కోసం వాడుకుంటే సినిమాలు ఎలా హిట్ అవుతాయి.? 2011 లో కెప్టెన్ అమెరికా అనే అవెంజర్ మూవీ వచ్చింది.. దేశాన్ని కాపాడే ప్రయత్నంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మంచులో చిక్కుకుపోయి 21వ శతాబ్దంలో బయట పడతాడు..అవెంజర్ గా మారి మళ్ళీ దేశం కోసం పని చేస్తూ ఉంటాడు.. సేమ్ అదే పాయింట్ ని బేస్ చేసుకుని వచ్చిన “డిస్కో రాజా”లో 35 ఏళ్ల క్రితం చనిపోయి మంచులో కూరుకుపోయిన రవితేజని స్టెమ్ సెల్స్ ద్వారా తిరిగి బ్రతికిస్తారు కొందరు శాస్త్రవేత్తలు…
కెప్టెన్ అమెరికా అంటే దేశం కోసం చనిపోవడానికి సిద్ధపడ్డ హీరో కాబట్టి hollywood లో అతన్ని బ్రతికించి మళ్ళీ వాడుకున్నారు.. కానీ మన డైరెక్టర్ చేసేది నిఖార్సయిన తెలుగు సినిమా కాబట్టి ఒక అనాధ కం డాన్ అయిన హీరో… ఆయన పక్కన ఒక కామెడీ గాంగ్…ఒక అనాధ అయిన మూగ చెవుడు హీరోయిన్… ఒక రొటీన్ రౌడీ….ఇద్దరికీ రొటీన్ దందా గొడవలు… రొటీన్ లవ్ స్టొరీ… రొటీన్ ఫైట్స్… ఇలా సినిమా మీద ఇంట్రెస్ట్ పోయే ప్రతీ అవకాశాన్ని డైరెక్టర్ అస్సలు వదులుకునే సాహసం చేయలేదు…
Read Also: విన్నూత్న కథలకు పట్టం కట్టిన ప్రేక్షకులు
అందుకే సినిమాపై ఏ ఒక్కరూ పాజిటివ్ గా స్పందించలేదు. ఒక రొటీన్ డాన్ సినిమాకి సైంటిఫిక్ టచ్ ఇచ్చే ప్రయత్నం కాస్త వికటించింది. ఒక చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికిస్తున్నారు అంటే ఆ బ్రతికిన వ్యక్తి గతం అద్భుతంగ ఉంటుందని అందరూ ఆశిస్తారు.. కానీ ఆ వ్యక్తి గతాన్ని నిస్సారమైన డాన్ కథగా మార్చి ఏమాత్రం ఆసక్తి లేకుండా రూపొందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. రవితేజ ఇలాగే రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతే తన కెరీర్ ప్రమాదంలో పడినట్లే..
ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.. గత సంవత్సరం తెలుగులో హిట్ అయిన సినిమాలను పరిశీలిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.. బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఎవరు, రాక్షసుడు, ఖైదీ, మత్తువదలరా సినిమాలు ప్రేక్షకుల్లో మారుతున్న అభిరుచికి అద్దం పడతాయి. ఖైదీ, మత్తువదలరాలను బట్టి కథను అందంగా చెప్పగలిగితే పాటలు, కథానాయిక లేకున్నా ప్రేక్షకులు పట్టించుకోరన్న సంగతి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాటి చెప్పాయి.. కానీ డైరెక్టర్లు, నిర్మాతలు ఆ విషయాన్ని గుర్తించినట్లు లేరు.. అందుకే ప్రేక్షకులు రొటీన్ సినిమాలను నిర్మొహమాటంగా తిప్పికొడుతున్నారు.. ఇకనైనా డైరెక్టర్లు విన్నూత్న చిత్రాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మంచిది..