iDreamPost
android-app
ios-app

దేశంలోనే మొదటిసారి.. నిమ్స్‌ ఆస్పత్రిలో ఇకపై రోబోటిక్‌ సర్జరీలు!

దేశంలోనే మొదటిసారి.. నిమ్స్‌ ఆస్పత్రిలో ఇకపై రోబోటిక్‌ సర్జరీలు!

శాస్త్ర సాంకేతికతను అంది పుచ్చుకోవటంలో.. తద్వారా ప్రజలకు మంచి పాలన అందించటంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటోంది. ముఖ్యంగా వైద్య సేవల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటానికి కొత్త కొత్త టెక్నాలజీని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు దేశంలోనే అ‍గ్రగామిగా నిలుస్తున్నాయి. ఇక, ఆధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం తొలి అడుగు వేసింది. నిమ్స్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోబోటిక్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

సోమవారం నుంచి నిమ్స్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ టెక్నాలజీ ద్వారా పలు రకాల సర్జరీలను చేయనున్నారు. ఇలా రోబోటిక్‌ టెక్నాలజీ ద్వారా సర్జరీలు చేసే విధానంలో దేశంలోనే మొదటి సారి కావటం… అది కూడా తెలంగాణ ప్రభుత్వమే మొదటిసారి ఇందుకు శ్రీకారం చుట్టడం విశేషం. నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీల కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది. ఏకంగా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నిరు పేదలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ఉద్ధేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిమ్స్‌లో రోబోటిక్‌ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఆయన నిర్ణయంతో తెలంగాణలోని ప్రభుత్వ వైద్య శాలలు దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోల్‌ మోడల్‌గా మారుతున్నాయి.

రోబోటిక్‌ సర్జరీలు ఎలా జరుగుతాయి?

డాక్టర్లు కంప్యూటర్‌ మానిటర్‌ సహాయంతో రోబోటిక్‌ హ్యాండ్స్‌ను ఉపయోగించి సర్జరీలు చేస్తారు. ఆపరేషన్‌ సమయంలో డాక్టర్లు తమ చేతిని అన్ని విధాలుగా తిప్పి ఆపరేషన్‌ చేయటం సాధ్యపడదు. ఇలాంటి సమయంలో రోబోలను ఉపయోగించి ఆపరేషన్‌ పూర్తి చేస్తారు. కొన్ని సార్లు డాక్టర్ల అవసరం లేకుండానే ఆపరేషన్‌లు జరిగిపోతాయి. మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రాశయం, క్యాన్సర్‌ వంటి వాటికి రోబోటిక్‌ టెక్నాలజీ ద్వారా సులభంగా ఆపరేషన్‌ చేయోచ్చు. ప్రస్తుతానికి 20 మంది వైద్యులకు రోబోటిక్‌ టెక్నాలజీ ఉపయోగించి ఆపరేషన్‌లు చేసే దానిపై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కింద కూడా రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరి, దేశంలోనే మొదటిసారి నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.