iDreamPost
android-app
ios-app

ఆర్.ఎం.పి. వైద్యునికి సోకిన కరోనా…. భయాందోళనలో దాచేపల్లి

ఆర్.ఎం.పి. వైద్యునికి సోకిన కరోనా….  భయాందోళనలో దాచేపల్లి

కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ఎంపీ డాక్టర్‌లను జ్వరము,జలుబుతో తమ వద్దకు వచ్చే పేషెంట్లకు చికిత్స అందించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.కానీ కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి కరోనా గురించిన అవగాహన లేమితో వైద్యం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఈ కోవకు చెందిన ఒక ఆర్ఎంపీ వైద్యుడు తన వద్దకు వచ్చిన పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో కరోనా మహమ్మారిని అంటించుకున్నాడు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని నారాయణపురం అనే గ్రామంలో ఒక RMP డాక్టర్ గత కొంతకాలంగా క్లినిక్ నడుపుతున్నాడు.అతను వారం రోజుల నుండి జ్వరము,జలుబుతో బాధపడుతున్నాడు.దీంతో అతనిని క్వారంటైన్‌కు తరలించి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స పొందిన వ్యక్తులు స్వచ్చందంగా వచ్చి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

అధికారుల పిలుపుకు స్పందించిన మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 300 వందల మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.వీరి కోసం దాచేపల్లిలోని బ్రహ్మనాయుడు గ్రాండ్‌లో ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను జిల్లా వైద్య అధికారులు ఏర్పాటు చేశారు.కరోనా నిర్ధారణ పరీక్ష కోసం తరలి వచ్చిన ప్రజలు బ్రహ్మనాయుడు గ్రౌండ్ నిండిపోయింది.మైదానంలో వీరందరి మధ్య సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ధారణ పరీక్ష కోసం రక్త నమూనాలను వైద్య సిబ్బంది సేకరించింది.ఈ ఘటనతో ఉలిక్కిపడిన దాచేపల్లి మండలంలోని ప్రజలు కరోనా భయంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.పైగా ఏపీలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులలో భయాందోళన నెలకొంది.