iDreamPost
android-app
ios-app

సినీరంగం నుంచి వచ్చి మంత్రులుగా ఎదిగి.. రోజా రికార్డ్

  • Published Apr 12, 2022 | 6:25 PM Updated Updated Apr 12, 2022 | 8:50 PM
సినీరంగం నుంచి వచ్చి మంత్రులుగా ఎదిగి.. రోజా రికార్డ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిపిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్థానం సంపాదించి సినీరంగం నుంచి వచ్చి మంత్రి అయిన ఘనత సాధించారు. ఆమెకు ముందు ఇద్దరు మాత్రమే.. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర మంత్రులు అయిన ఘనత సాధించారు. టీడీపీ హయాంలో సినీనటులు ఎన్. శివప్రసాద్, బాబుమోహన్ మంత్రి పదవులు నిర్వహించారు. వాస్తవానికి సినీ-రాజకీయ రంగాల మధ్య బంధం ఈనాటిది కాదు. ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ గతంలోనూ ఇప్పుడు పలువురు సినీరంగ ప్రముఖులు రాణిస్తున్నారు. అయితే ఎక్కువమంది పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించిన వారే తప్ప కేంద్ర, రాష్ట్రాల మంత్రులు అయిన వారు తక్కువ. వారిలో కూడా ఏపీదే పైచేయిగా ఉంది. కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన ఐదుగురిలో మన రాష్ట్రానికి చెందిన దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, చిరంజీవి ఉండగా.. బాలీవుడ్ కు చెందిన శత్రుఘ్న సిన్హా, స్మృతి ఇరానీ ఉన్నారు.

రాష్ట్రంలో రోజాకు ముందు ఇద్దరు

సినీరంగంలో ఏళ్ల తరబడి కొనసాగి స్టార్ హీరోయిన్ గా పేరొందిన రోజా మొదట టీడీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2014 ఎన్నికల్లో నగరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి అదే స్థానం నుంచి విజయం సాధించారు. తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీఎం జగన్ రోజాకు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో మంత్రి అయిన తొలి సినీరంగ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా రోజాకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర మంత్రులైన ఇద్దరూ పురుషులే. వారిలో ఒకరు చిత్తూరు జిల్లాకే చెందిన డాక్టరు నారుమల్లి శివప్రసాద్. నటుడు, నిర్మాత అయిన శివప్రసాద్ .1990 ప్రాంతంలో టీడీపీలో చేరిన ఆయన 1999లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి చంద్రబాబు కేబినెట్లో సమాచార మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మెదక్ జిల్లా ఆందోల్ నుంచి ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ 1998 ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి 1999 ఎన్నికల్లోనూ గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర మంత్రులుగా ముగ్గురు

ఇక జాతీయస్థాయిలో చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు. వారిలో ముగ్గురు మనరాష్ట్రానికి చెందినవారే కావడం విశేషం. రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రముఖ హీరో కృష్ణంరాజు 1998 పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తిరిగి 1999 ఎన్నికల్లోనూ విజయం సాధించి వాజపేయి నేతృత్వంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. గ్రామీణాభివృద్ధి, రక్షణ తదితర శాఖలు పర్యవేక్షించారు. ఆయన తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 2006లో కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. 2009 ఎన్నికల్లో విఫలమైన మెగాస్టార్ చిరంజీవి 2012లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ప్రతిగా అదే ఏడాది కాంగ్రెస్ అతన్ని రాజ్యసభకు నామినేట్ చేయడంతోపాటు అదే ఏడాది ఆక్టోబరులో యూపీఏ-2 మన్మోహన్ సింగ్ కేబినెట్లో పర్యాటక సహాయ మంత్రి(ఇండిపెండెంట్ ఛార్జ్)గా నియమించింది. ఇక బాలీవుడ్ కు చెందిన శత్రుఘ్న సిన్హా బీజేపీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత 2000లో వాజపేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మరో హిందీ నటి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ 2014లో నరేంద్రమోడీ తొలి కేబినెట్లో మంత్రిగా చేశారు. 2019లో ఆమేథీలో రాహుల్ గాంధీనే ఓడించి ఎంపీ అయిన ఆమె మోడీ రెండో క్యాబినెట్లోనూ మహిళా శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం కొనసాగుతున్నారు.