iDreamPost
android-app
ios-app

తిట్ట‌డంలోనే కాదు తిట్టించుకోవ‌డంలోనూ రాధాకృష్ణ మార్క్ జ‌ర్న‌లిజం

తిట్ట‌డంలోనే కాదు తిట్టించుకోవ‌డంలోనూ రాధాకృష్ణ మార్క్ జ‌ర్న‌లిజం

మంచైనా చెడైనా ఆంధ్ర‌జ్యోతి గురించి మాట్లాడుకోకుండా ఉండ‌లేని స్థితి. ద‌ర్శ‌కుడు పోసాని  మా బాస్ రాధాకృష్ణను లోప‌ర్ అన్నా, డూప‌ర్ అన్నా…అంటే అన్నావుపో. అంతిమంగా మా బాస్ ప్రొపెష‌న‌ల్ జ‌ర్న‌లిస్టు అనిపించుకున్నారు. ఎందుకంటే గ‌త ఆదివారం వికృత చేష్ట‌లు…గుర‌వింద నీతులు శీర్షిక‌తో మా బాస్ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త‌ప‌లుకు తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాసంలో ఆంధ్ర‌జ్యోతి పూర్వ సంపాద‌కుడు, ప్ర‌స్తుత ప‌బ్లిక్ పాల‌సీ స‌ల‌హాదారుడైన కొండుభ‌ట్ల రామ‌చంద్ర‌మూర్తిపై ప‌రుష‌ప‌ద‌జాలాన్ని వాడారు.

న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనీ, జీవిత చ‌ర‌మాంకంలో సౌక‌ర్య‌వంత‌మైన జీవితం కోసం ప్ర‌భుత్వాల పంచ‌న చేరిపోతున్నార‌ని రామ‌చంద్ర‌మూర్తిపై రాధాకృష్ణ విమ‌ర్శ‌. దీనిపై రామ‌చంద్ర‌మూర్తి త‌న‌దైన శైలిలో రాధాకృష్ణ‌కు స‌మాధాన‌మిస్తూ రాసిన వ్యాసాన్ని అదే ఆంధ్ర‌జ్యోతి ఎడిట్ పేజీలో ప్ర‌చురించారు. వేమూరి రాధాకృష్ణ‌ను ప‌రోక్షంగా, కొన్ని ప్ర‌త్య‌క్షంగా తిట్టిపోసిన అక్ష‌రాల‌కు ఏ మాత్రం క‌త్తెర వేయ‌కుండా అచ్చేసిన ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ను అభినందించకుండా ఉండ‌లేం.

కొండుభ‌ట్ట రామ‌చంద్ర‌మూర్తి ఎవ‌రు గుర‌వింద‌లో అంద‌రికీ తెలుసు శీర్షిక‌న రాసిన వ్యాసంలోని కొన్ని వాక్యాల‌ను ప‌రిశీలిస్తే రాధాకృష్ణ‌ను ఎంత గాయ‌ప‌రిచి ఉంటాయో అర్థ‌మ‌వుతుంది. సంపాద‌కుడిని పూర్వ‌ప‌క్షం చేసి మీ రాజ‌కీయ ల‌క్ష్యాల కోసం మీరే వార్తాక‌థ‌నాలూ, విశ్లేష‌ణ‌లూ నిర్దేశించ‌డం , విలేఖ‌రుల‌కు పుర‌మాయించ‌డం ప్రారంభించిన త‌ర్వాత మీకు అడ్డులేకుండా మ‌ర్యాద‌గా త‌ప్పుకున్నానని రామ‌చంద్ర‌మూర్తి పేర్కొన్నారు.

ఇక్క‌డో విష‌యం గురించి చెప్పుకొందాం. ఓ ప‌త్రిక‌లో ఎడిట‌ర్‌కు తెలియ‌కుండా అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ హెడ్స్ ప‌నుల‌న్నీ చ‌క్క‌పెడుతున్నార‌ట‌. చివ‌రికి వారు ఎడిటోరియ‌ల్‌లో కూడా జోక్యం చేసుకోవ‌డాన్ని ఎడిట‌ర్ త‌ట్టుకోలేక‌పోయారు. మ‌న‌సును కుంగ‌దీస్తున్న ఆ విష‌యం గురించి త‌న స్నేహితుడితో పంచుకున్నాడు. అప్పుడా మిత్రుడు అయ్యా సంపాద‌కులు గారు మీకు సంపాద‌కుడ‌నే ఉద్యోగం కావాలే త‌ప్ప మీ య‌జ‌మానికి ఎడిట‌ర్ అవ‌స‌రం లేద‌నే న‌గ్న స‌త్యాన్ని తెలుసుకోండి అని స‌త్యాన్ని ఆవిష్క‌రించార‌ట‌. రామ‌చంద్ర‌మూర్తి లేవ‌నెత్తిన అంశం  ఓ న‌వ‌ల‌లోని పాత్ర‌ల సంభాష‌ణ గుర్తు తెప్పించింది.

అక్ష‌రాన్ని న‌మ్ముకుని బ‌తికిన వాడినే కానీ అమ్ముకున్న వాడిని కాను. మీరు ప‌త్రికారంగంలో ప్ర‌వేశించ‌క ముందే నేను అనేక ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌తో ఉద‌యం ప‌త్రిక‌ను న‌డిపంచాను….రాత‌లు రాధాకృష్ణ‌కు చెంప‌దెబ్బ‌లాంటివే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఓ సాధార‌ణ జ‌ర్న‌లిస్టు తాను ప‌నిచేసే ప‌త్రిక‌నే కొన‌గ‌లిగే స్థాయికి ఎద‌గ‌డం అసాధ్యం. ఎందుకంటే జీతంపై ప‌నిచేసే వాళ్ల‌కు ఏనెల‌కానెల జీతం ఖ‌ర్చు అవుతుంది. కాని రాధాకృష్ణ ఆంధ్ర‌జ్యోతిలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తూ కొంత కాలానికి ఆ ప‌త్రిక‌నే కొన్నారు. అక్ష‌రాన్ని న‌మ్ముకుని బ‌తికిన వాడినే కానీ అమ్ముకున్న‌వాడిని కాను అనే మాట‌లు రాధాకృష్ణ‌ను ప‌రోక్షంగా ఎత్తిపొడిచిన‌వే. అంతేకాదు మీరు ప‌త్రికారంగంలో ప్ర‌వేశించ‌క ముందే నేను అనేక ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌తో ఉద‌యం ప‌త్రిక‌ను న‌డిపంచానన‌డం కూడా…నేను అప్ప‌టికీ ఇప్ప‌టికీ జ‌ర్న‌లిస్టుగానే జీవితాన్ని గ‌డుపుతున్నాన‌ని చెప్ప‌డం ద్వారా…అక్ర‌మ సంపాద‌న‌తో య‌జ‌మాని కాలేద‌ని రాధాకృష్ణ‌కు గుర్తు చేయ‌డ‌మే.

మీరు ద్వేషించిన రాజ‌కీయ నాయ‌కుల‌ను మీతో స‌మానంగా ద్వేషించ‌నందుకా? మీరు ప్రేమిస్తున్న రాజ‌కీయ నేత‌ల‌ను మీతో స‌మానంగా ప్రేమించ‌నందుకా? అని రాధాకృష్ణ‌ను నిల‌దీస్తూ వ్యాసం ముందుకు సాగింది. జ‌గ‌న్‌ను ద్వేషించ‌నందుకా, చంద్ర‌బాబును ప్రేమించ‌నందుకా నాపై మీకు కోపం అని రామ‌చంద్ర‌మూర్తి సూటిగా, సుత్తిగా లేకుండా ప్ర‌శ్నించారు.

గిట్ట‌ని ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా చేర‌డం మీకు న‌చ్చ‌క‌పోవ‌డం, దిగజారుడుగా క‌నిపించ‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదని చెప్ప‌డం ద్వారా  రాధాకృష్ణ అక్ష‌రాలకున్న విలువ ఏమిటో విడ‌మ‌రిచి చెప్పారు.

2007, ఫిబ్ర‌వ‌రి 23న ఆంధ్ర‌జ్యోతిలో రాసిన సంపాద‌కీయం ఇప్పుడు చ‌దివితే నేను రాసింది కాద‌నిపిస్తోంది. ఎందుకంటే అది నా భాష కాదు,  శైలికాదని రామ‌చంద్ర‌మూర్తి చెప్ప‌డం పాఠ‌క లోకానికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. దీన్ని రాధాకృష్ణ కూడా రామ‌చంద్ర‌మూర్తికి స‌మాధానంగా రాసిన లేఖ‌లో ఖండించక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మీరు రాయ‌క‌పోయినా మీరు రాయించి ఉంటార‌న్నారే త‌ప్ప కొత్త‌ప‌లుకులో రామ‌చంద్ర‌మూర్తే రాశార‌న్న వాద‌న‌ను స‌మ‌ర్థించుకోలేక‌పోవ‌డం కొస‌మెరుపు.

స‌మాజానికి రామ‌చంద్ర‌మూర్తీ తెలుసు, రాధాకృష్ణ తెలుసు. ఎవ‌రివి వికృత చేష్ట‌లో, ఎవ‌రు గురివింద‌లో అంద‌రికీ తెలుసు అంటూ కొండుభ‌ట్ల రామ‌చంద్ర‌మూర్తి తాను చెప్ప‌ద‌ల‌చుకున్నఅంశాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుగా తూటాల్లాంటి అక్ష‌రాల‌తో రాధాకృష్ణ‌ను బోనులో బందించారు.

దీనికి స‌మాధానంగా రాధాకృష్ణ రాసిన వ్యాసంలోని చివ‌రి వాక్యాన్ని మాత్ర‌మే మీ ముందు ఉంచుతాను. అదేంటంటే…మీరు కోరిన‌ట్టు మీ వివ‌ర‌ణ‌ను య‌ధాత‌థంగా ప్ర‌చురించాం. ఇదే మా నిబ‌ద్ధ‌త‌కు, నైతిక బ‌లానికి నిద‌ర్శ‌నం అని రాధాకృష్ణ త‌న‌దైన శైలిలో ముగింపు ప‌లికారు.

అయితే ఇక్క‌డో విష‌యాన్ని చెప్పుకోవాలి. ఎన్ని లోపాలున్నా ఆంధ్ర‌జ్యోతి ఎడిట్ పేజీ మిగిలిన అన్ని ప‌త్రిక‌ల కంటే కూడా విభిన్న అభిప్రాయాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఆ ప‌త్రిక ఎడిట‌ర్ శ్రీ‌నివాస్ వ్యాసాల్లోని అంశాల‌ను వ్య‌తిరేకిస్తూ రాసిన ఆర్టిక‌ల్స్‌కు చోటు క‌ల్పించిన సంద‌ర్భాలు అనేకం. ఇది ప్ర‌జాస్వామ్యానికి, భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు చాలా మంచి వాతావ‌ర‌ణం.

ఎటొచ్చి మా బాస్ రాధాకృష్ణ‌కు జ‌గ‌న్ గుర్తుకొస్తే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతారు. ఆదివారం కొత్త‌ప‌లుకులో ఏం ప‌లుకుతున్నారో త‌న‌కే అర్థం కాక‌, అర్థం తెలియ‌క క‌త్తిసాము చేస్తుంటారు. చంద్ర‌బాబు, లోకేష్ గుర్తుకొస్తే మ‌న‌సు ఎటో వెళ్లిపోయి అక్ష‌ర ప్రేమ‌ను కురిపిస్తారు.

బాసూ ఒక్క విష‌యం గుర్తించుకోండి. అడ‌వికాచిన వెన్నెల చందంగా…జ‌గ‌న్‌పై కోప‌మైనా, చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ఫై అలివి కాని ప్రేమైనా ఎప్పుడో ఒక‌సారి అడ‌వికాచిన వెన్నెల మాదిరి కాక త‌ప్ప‌దు. ఆ రెండు బ‌ల‌హీన‌త‌ల‌ను రాధాకృష్ణ అధిగ‌మిస్తే మాత్రం జ‌ర్న‌లిజంలో ఆంధ్ర‌జ్యోతికి తిరుగుండ‌ద‌నేది ప‌చ్చి నిజం.

ఏది ఏమైనా ఎవ‌రినైనా తిట్టాల‌న్నా, ఎవ‌రితోనైనా తిట్టించుకోవాల‌న్నా మా ఆంధ్ర‌జ్యోతి, మా బాస్ రాధాకృష్ణ త‌రువాతే ఎవ‌రైనా. అదే ఆంధ్ర‌జ్యోతి-ఎబిఎన్ రాధాకృష్ణ మార్క్ జ‌ర్న‌లిజం అంటే. దీనికి రామ‌చంద్ర‌మూర్తి వ్యాసం కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?