iDreamPost
android-app
ios-app

Rishabh Pant: ఆ రివ్యూ తీసుకొని ఉంటే ప్లే ఆఫ్ లో ఢిల్లీ! విలన్‌గా మారిన పంత్‌

  • Published May 22, 2022 | 10:59 AM Updated Updated May 22, 2022 | 10:59 AM
Rishabh Pant: ఆ రివ్యూ తీసుకొని ఉంటే ప్లే ఆఫ్ లో ఢిల్లీ! విలన్‌గా మారిన పంత్‌

భారీ హిట్ట‌ర్లు, అంద‌రూ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్స్. కచ్చితంగా ప్లే ఆఫ్స్‌ చేరుకుంటుందని అంచ‌నా వేసిన టీం. అలాంటిది ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమికి, ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పరోక్షంగా కార‌ణ‌మ‌వ‌డం షాకింగ్. ఈ సీజ‌న్ లో ముంబై ఆట‌తీరు అంతంత మాత్రం. ఈ మ్యాచ్ లో గెలిస్తే. ప్లే ఆఫ్ వెళ్తుంది. అందుకే పంత్‌పై తీవ్ర ఒత్తిడి సహజం. ఆ ఒత్తిడిలో క్యాచ్‌ మిస్ చేశారు. అంత‌క‌న్నా పెద్ద త‌ప్పు… బ్యాట్ కి బాల్ తగిలినా, ఏ నిర్ణ‌యం తీసుకోలేక రివ్యూను అడ‌గ‌లేదు. అప్ప‌టిదాకా ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్ అక్క‌డ నుంచి ముంబై కంట్రోల్ లోకి వ‌చ్చింది. ఇది టర్నింగ్‌ పాయింట్‌. గోల్డెన్‌ డక్‌ అవ్వాల్సిన బ్యాట్స్‌మన్‌, వ‌రుస‌పెట్టి సిక్స్ లు బాది ముంబైని గెలిపించాడు.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్ లో మూడో బంతికి శార్దూల్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ను (25 ర‌న్స్) ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మోస్ట్ డేంజ‌ర‌స్ టిమ్‌ డేవిడ్ బ్యాటింగ్ కు వ‌చ్చాడు. ఈ సీజ‌న్ అత‌ని స్ట్రైక్ రేట్ 200. శార్దూల్‌ ఆఫ్‌స్టంప్‌ అవతల బంతిని విసిరాడు. అది బ్యాట్‌ పక్కనుంచి వెళ్లి కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. బ్యాట్‌కు తాకినట్లు సౌండ్ రావడంతో పంత్‌ అప్పీల్‌ చేశాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు.

అప్పుడు పంత్‌ రివ్యూ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కాని ఢిల్లీ కెప్టెన్ మాత్రం రివ్యూకు వెళ్లలేదు. డీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా పంత్‌ ఎంత పెద్ద తప్పు చేశాడో మరుక్షణంలోనే బిగ్ స్క్రీన్ మీద‌ తెలిసిపోయింది. బ్యాట్‌కు బంతి తాకినట్లుగా అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్‌ కనిపించింది. అలా గోల్డెన్‌ డక్‌ నుంచి బతికిపోయిన టిమ్‌ డేవిడ్‌, 11 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో సుడిగాలిలా 34 పరుగులు చేశాడు. అంతే సీన్ మారిపోయింది. ఆ తర్వాత అతను ఔటైనా రమన్‌దీప్‌ సింగ్‌ ముంబైని గెలిపించి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు.

పంత్‌ ఆ రివ్యూ తీసుకొని ఉంటే? టిమ్‌ డేవిడ్‌ గోల్డెన్ డక్‌ అయి ఉంటే, ముంబై ఓడిపోయేది. ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. ఒక్క చెత్త నిర్ణ‌యంతో ప్లే ఆఫ్ ఛాన్స్ ల‌ను దూరం చేశాడ‌ని ఫ్యాన్స్‌ రిషబ్‌ పంత్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌కు దూరమవ్వడానికి పెద్ద విల‌న్ రిషబ్‌ పంత్‌, కెప్టెన్‌గా పనికిరాడు. రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ క‌ప్ కొట్టేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.