iDreamPost
android-app
ios-app

అందుకేనా కాళ్లు మొక్కినా నమ్మలేదు..!

అందుకేనా కాళ్లు మొక్కినా నమ్మలేదు..!

ఢిల్లీ అధిష్టానం, అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో తప్పా కొంత మంది నాయకులకు ఇతర పార్టీల్లో.. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో ఇడమలేరు. ఇంకా చెప్పాలంటే అయా నాయకులను ప్రాంతీయ పార్టీలు భరించలేవు. అందుకే చేర్చుకునేందుకు ఇష్టపడవు. ఇలాంటి నాయకుల జాబితాలో ముందువరసలో ఉంటారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పతనమైంది. అప్పటి నుంచి రెండు ఎన్నికలు జరిగినా హర్షకుమార్‌కు సరైన రాజకీయ వేదిక లభించకపోవడానికి కారణం ఆయన వ్యవహారశైలేనన్న అభిప్రాయాలున్నాయి.

తాజాగా తన వ్యవహారశైలిని హర్షకుమార్‌ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా బయటపెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరాలని అనుకున్నారట. ఈ ఆలోచనతోనే తన వర్గం నుంచి చాలా మందిని జనసేనలోకి పంపారట. జనసేన నుంచి పిలుపు కోసం ఆయన చాలా ఎదురుచూశారట. జనసేనలోకి ఆహ్వానించేందుకు పవన్‌ కళ్యాణే తన వద్దకు వస్తున్నారని సమాచారం అందిందట. కానీ ఏమైందో ఏమో పవన్‌ కళ్యాణ్‌ రాలేదట. పవన్‌ కళ్యాణ్‌ ఇన్‌సెక్యూరిటీ ఫీల్‌ అవ్వడంతోనే తనను పార్టీలోకి చేర్చుకోలేదని హర్షకుమార్‌ ఈ రోజు ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ గత ఎన్నికల ముందు తన పరిస్థితిని చెప్పుకొచ్చారు.

తాను జనసేనలో చేరాలనుకున్న విషయం హర్షకుమార్‌ మొదటిసారి బహిరంగంగా చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో హర్షకుమార్‌ వైసీపీలో చేరాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే 2004లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరెడ్డి పట్ల ఆయన వ్యవహరించిన తీరు కారణంగా వైసీపీలో హర్షకుమార్‌కు అవకాశం రాలేదన్నది రాజకీయ వర్గాల్లో నడిచిన టాక్‌. వైసీపీలో అవకాశం లభించకపోవడంతో జనసేన వైపు చూశారు. అక్కడ నుంచి కూడా పిలుపు రాలేదని హర్షకుమారే స్వయంగా వెల్లడించారు. చివరికి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఎన్నికల కొద్ది రోజులు ముందు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అమలాపురం లోక్‌సభ టిక్కెట్‌ ఆశించారు. హర్షకుమార్‌కే టిక్కెట్‌ వస్తుందని ఆయన అనుచరులు బలంగా విశ్వసించారు. మీడియాలోనూ కథనాలు వచ్చాయి. కానీ చంద్రబాబు హర్షకుమార్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడుకు లోక్‌సభ సీటు ఇచ్చారు.

హర్షకుమార్‌ వ్యవహారశైలిని చంద్రబాబు ఆది నుంచి గమనించారు కాబట్టే అమలాపురం లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్ల వ్యవహరించిన తీరు, ఆ తర్వాత పరిణామాలను బేరీజు వేసుకున్న చంద్రబాబు.. ఈ నిర్ణయం తీసుకున్నారనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్‌. పైగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల కోసం వేటలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా హర్షకుమార్‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆలోచించారంటే హర్షకుమార్‌ పట్ల ప్రాంతీయ పార్టీ నేతలు ఏ భావనతో ఉన్నారో అర్థం అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ ఇన్‌సెక్యూరిటీ ఫీల్‌ అయ్యారని హర్షకుమారే చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

ప్రజా బలం, భవిష్యత్‌ ఉన్న ప్రాంతీయ పార్టీలలో ఇక తనకు అవకాశం లభించదనే హర్షకుమార్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి వెళుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్‌లో హర్షకుమార్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా సాగుతుంది..? ఉనికి పాట్లు పడుతున్న కాంగ్రెస్‌కు హర్షకుమార్‌ ఊపిరి పోస్తారా..? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.