iDreamPost
iDreamPost
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టాప్ 3 వెబ్ సిరీస్ లో చెక్కుచెదరకుండా తన స్థానాన్ని కాపాడుకుంటున్న మనీ హీస్ట్ సీజన్ 4 ఇటీవలే విడుదలయింది. కొద్దిరోజులకే ఇది టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోవడం చూస్తే దీనికి ఎంత పాపులారిటీ ఉందో అర్థమవుతుంది. నిజానికిది స్పానిష్ లో తీసిన ఒరిజినల్ వెర్షన్. నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుగోలు చేశాక ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి తమ స్ట్రీమింగ్ యాప్ ద్వారా విడుదల చేశారు. ఒక్క ఎపిసోడ్ చూసినా చాలు మిగిలినవి చూసే దాకా వదిలిపెట్టకపోవడం దీని ప్రత్యేకత.
అలా అని ఇది క్లైమాక్స్ కు చేరలేదు. త్వరలో సీజన్ 5 కూడా రాబోతోంది. ఇంకా ఎన్ని భాగాలు వస్తాయో నిర్మాతలు వెల్లడించడం లేదు. మనీ హీస్ట్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా ఇందులో ఏముందా అనే సందేహం రావడం సహజం. బ్యాంకులను లూటీ చేయడానికి స్కెచ్ వేసిన ప్రొఫెసర్ అనబడే వ్యక్తి ఒక గ్యాంగ్ ని ఏర్పరచుకుంటాడు. అందులో సభ్యులను అసలు పేర్లతో కాకుండా సిటీ నేమ్స్ తో పిలుచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన కమ్యూనికేషన్ సిస్టంని తయారుచేసుకుంటాడు. ఇతగాడు ఎంతటి కాలాంతకుడు అంటే తమను పట్టుకోవడానికి అప్పోయింట్ చేయబడ్డ సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్ ని ట్రాప్ చేసి ప్రేమలో పడేసి ఆమెను కూడా క్రైమ్ పార్ట్నర్ గా చేసుకునేంత. ఇక అక్కడి నుంచి కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతూ ఊహకందకుండా సాగుతుంది.
స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇది మన ‘క్షణక్షణం’ తరహాలోనే అనిపిస్తుంది. కానీ మనీ హీస్ట్ లో గొప్పదనమంతా ట్రీట్మెంట్ లో ఉంటుంది. ఇందులో హీరో ఉండడు. విలన్ అతని అనుచరులు మాత్రమే ఉంటారు. మిగిలినవన్నీ పాత్రలే. చూస్తున్నంత సేపు మనమూ ఆ బ్యాంకులో బందీలుగా ఉన్నామేమో అనిపించేంత సహజంగా చిత్రీకరించారు. దానికి తోడు అద్భుతమైన క్యాస్టింగ్ దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి పాత్రకు పర్ఫెక్ట్ అనిపించే యాక్టర్స్ ని ఎంచుకువడంలో దర్శకుడు చూపించిన నైపుణ్యం అపారం. మేకింగ్ సైతం ఎక్కడా రాజీ పడకుండా భారీ ఖర్చుతో తీశారు. బడ్జెట్ లెక్కల్లో ఎంతయ్యిందో చెప్పడం కష్టం కానీ మేకింగ్ లో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది.
గ్యాంగ్ లో మెంబెర్స్ ని విభిన్న వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా కూర్చిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేం. దర్శకుడు అలెక్స్ పినా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. ప్రొఫెసర్ గా చేసిన అల్వారో మోర్టే అందరి కంటే ఎక్కువగా షో స్టీలర్ అని చెప్పొచ్చు. అరుపులు లేకుండా మైండ్ గేమ్ తో తన తెలివితేటలను ప్రదర్శించే పాత్రలో అబ్బురపరుస్తాడు. ఇతనే కాదు ప్రతి ఒక్కరు ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. అంత దుర్మార్గం చేస్తున్నా వాళ్ళ మీద ప్రేక్షకులకు జాలి కలుగుతుందే తప్ప ఇది తప్పు అనిపించేలా చేయకపోవడమే మనీ హీస్ట్ కథనంలోని గొప్పదనం. ఇప్పటికే 31 ఎపిసోడ్లతో అప్రతిహతంగా సాగిన మనీ హీస్ట్ త్వరగా ముగిసిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. అదే ఇందులోని ప్రత్యేకత. అందుకే కోట్లాది వ్యూయర్స్ దీని ప్రేమలో పడిపోయారు.