iDreamPost
iDreamPost
ఏ సినిమాకైనా హీరో క్యారెక్టరైజేషన్ చాలా కీలకం. ఆ పాత్ర తాలూకు స్వభావాలు ఎమోషన్లను బట్టే జనం కనెక్ట్ అవ్వడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మునుపు వచ్చిన బ్లాక్ బస్టర్ ని బట్టో టైటిల్ లో ఉన్న కులం కార్డుని బట్టో కలెక్షన్లు రాబట్టుకోలేం. దానికో ఉదాహరణ చూద్దాం. 1995 ‘పెదరాయుడు’ ఇండస్ట్రీ హిట్ సాధించాక కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి దాని తర్వాత చిత్రాలకు అంచనాలను అందుకోలేక చాలా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. కలెక్టర్ గారు, అడవిలో అన్న, శ్రీ రాములయ్య హిట్లనుపించుకోగా అదిరింది అల్లుడు, యమజాతకుడు, వీడెవడండి బాబు, రాయుడు, ఖైదీగారు ఇలా పరాజయాలు గట్టిగానే పలకరించాయి.
అదే సమయంలో ఈయన ప్రాణ స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోసం రాసుకున్న ఓ కథను చేసుకోమని రికమండ్ చేశారు. అదే రాయలసీమ రామన్న చౌదరి. పెద్ద కుటుంబానికి చెందిన హీరో ఊళ్ళో పరిస్థితుల వల్ల నాస్తికుడిగా మారి మంచి చెడ్డా చూసుకోకుండా అందరి భూములు లాగేసుకుంటూ చివరికి దేవుడి గొప్పదనాన్ని తెలుసుకునే పాయింట్ తో ఇది రూపొందింది. దర్శకుడిగా దీనికి అనుభవం ఉన్న వాళ్లయితేనే డీల్ చేయగలరని బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణకు ఆ బాధ్యతను అప్పగించారు. అప్పటికే ఆయనకు తెలుగులో స్ట్రెయిట్ గా ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ, మాస్టర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఆడలేదు.
పరుచూరి బ్రదర్స్ మంచి పవర్ ఫుల్ సంభాషణలతో స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఫుల్ ఫామ్ లో ఉన్న మణిశర్మ పాటల కన్నా గొప్పగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. జయసుధ, ప్రియా గిల్, చంద్రమోహన్, నర్రా, జయప్రకాశ్ రెడ్డి, అచ్యుత్, ప్రేమ తదితరులు ప్రధాన తారాగణం కాగా అఘోరా పాత్రలో నెపోలియన్ స్పెషల్ క్యామియో చేశారు. నాస్తికత్వం, హీరోయిజం ఇవన్నీ సరిగానే కుదిరినప్పటికీ సెకండ్ హాఫ్ లో డ్రామా శృతి మించడం, రెండో మోహన్ బాబుని పూర్తిగా డమ్మీని చేయడం లాంటివి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓవర్ అయ్యింది. కట్ చేస్తే భారీ అంచనాలతో కలెక్షన్ కింగ్ 500వ సినిమాగా 2000 సెప్టెంబర్ 15న విడుదలై అంచనాలు అందుకోలేకపోయింది. అదే రోజు వచ్చిన శ్రీహరి అయోధ్య రామయ్య, ముందు రోజు రిలీజైన నిన్నే ప్రేమిస్తా హిట్ అయ్యాయి
Also Read : 1990 Sankranthi : ఎన్నో ట్విస్టులున్న 1990 జనవరి – Nostalgia