సీఎం జగన్ కు రాయలసీమ నేతల లేఖ

గ్రేటర్‌ సీమలో రాజధాని ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని సీఎం జగన్‌కు గ్రేటర్‌ రాయలసీమ నేతలు లేఖ రాశారు. మాజీ మంత్రులు మైసూరా రెడ్డి, శైలజానాథ్‌, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి సహా పలువురు నేతలు ఈ లేఖ పై సంతకం చేశారు. రాయలసీమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే 2014, 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు.

పరిపాలన వికేంద్రీకరణ సమర్థిస్తూనే.. రాయలసీమకు న్యాయం జరగాలని లేఖలో ఆకాంక్షించారు. గతంలో కర్నూలు రాజధానిని త్యాగం చేశామని, ఇప్పుడైనా సీమకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈనెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే భవిష్యత్‌ కార్యాచారణ ప్రకటిస్తామని వెల్లడించారు
.
కాగా, మాజీ మంత్రి మైసురా రెడ్డి ఓ మీడియా తో మాట్లాడుతూ.. గతంలో మద్రాస్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు నెల్లూరు వాళ్లు రాయలసీమతోనే ఉన్నారు. కృష్ణదేవరాయల పాలన సమయంలోనే అలాగే ఉండేది. రాయలసీమతో పాటు పాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలనే గ్రేటర్‌ రాయలసీమ అంటున్నామని మైసూరా పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయ రాజధాని లేదా పరిపాలన రాజధాని పెట్టాలన్నారు. విశాఖ వాళ్లు రాయలసీమకు రావడానికి దూరమైనపుడు.. సీమ ప్రజలు అక్కడికి వెళ్లడానికి దూరమవుతుందన్నారు. కర్నూలు రాజధానిని గతంలో త్యాగం చేశామని, అది అలానే ఉంటే రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందేదని మైసూరా వ్యాఖ్యానించారు.

Show comments