iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా చెప్పబడే పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. గడిచిన రెండేళ్ళలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,650 కోట్లు కేంద్రం నుండి రియింబర్స్ అవ్వాల్సి ఉండగా కేంద్రం 1 ఏప్రిల్ 2014 ముందు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్మెంటును పంపితేనే నిధులు మంజూరు చేస్తాం అని నాటి ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆడిట్ స్టేట్మెంట్ ను పంపక పోవడంతో పోలవరంకి నిధులు విడుదల అవ్వలేదు.
అయితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పోలవరానికి సంబంధించి ఆడిట్ స్టేట్మెంటును కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. దాంతో పోలవరంకి 1,850 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి శాఖ పంపిన ప్రతిపాదనలను 2019 నవంబర్ 8న కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో 1850 కోట్లు రీయింబర్స్ చేస్తు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమీష్నర్ అనూప్ కుమార్ శ్రీవాత్సవ గురువారం ఉత్తర్వులు జారీ చేసి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు మరింత వేగవంతం చేయటానికి అవకాశం దొరికింది.