iDreamPost
android-app
ios-app

బంగారు నగలు పోగొట్టిన ఎలుకలు.. పోలీసులకు యజమాని ఫిర్యాదు.. సీసీటీవీ ఫుటేజీ చూడగా..

  • Published Jun 16, 2022 | 5:19 PM Updated Updated Jun 16, 2022 | 5:19 PM
బంగారు నగలు పోగొట్టిన ఎలుకలు.. పోలీసులకు యజమాని ఫిర్యాదు.. సీసీటీవీ ఫుటేజీ చూడగా..

ఎలుకలు రూ.5 లక్షల విలువైన బంగారునగలను డ్రైనేజీ పాలు చేసిన వింత ఘటన ముంబైలో వెలుగుచూసింది. ఆ ఎలుకలు అంతఖరీదైన నగలను డ్రైనేజీలో ఎలా పడేశాయి ? అసలు డ్రైనేజీ వరకూ ఎలా తీసుకెళ్లాయి ? అనే కదా మీ సందేహం. పూర్తిగా చదవండి. సుందరి ప్లానిబేల్(45) అనే మహిళ నగరంలోని గోరేగావ్ లోని గోకుల్ ధామ్ కాలనీలో ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తోంది. రూ.5 లక్షల విలువచేసే తన నగలను బ్యాంకులో పెట్టేందుకు బయల్దేరింది. దారిమధ్యలో ఇద్దరు చిన్నారులు కనిపించగా.. బ్యాగులోనుంచి ఓ సంచి తీసి.. ఇందులో వడాపావ్ ఉంది తినండి అని ఇచ్చి బ్యాంకుకు వెళ్లింది. అక్కడ ఇంకో సంచి చూడగా నగలు కనిపించలేదు. చిన్నారులకు ఇచ్చిన సంచిలో నగలున్నాయని గుర్తించి.. ఆ చిన్నారులు కనిపించిన ప్రాంతానికి వెళ్లింది.

ఆ ప్రాంతంలో చిన్నారులు లేకపోవడంతో.. సుందరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. సంచి ఎక్కడుందని అడిగారు. వడాపావ్ తినాలనిపించకపోవడంతో.. సంచిని చెత్తకుండీలో విసిరేశామని చెప్పారు. వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. చెత్తకుండీలోంచి నగలసంచిని కొన్ని ఎలుకలు తీసుకెళ్లి పక్కనే ఉన్న డ్రైనేజీలో వేయడం కనిపించింది. వెంటనే ఆ డ్రైనేజీలో నుంచి నగల సంచిని వెలికి తీసి సుందరి ప్లానిబేల్ కు అప్పగించారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.