రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు శ్రీకారం

రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ కారణంగా గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియను నిలిపి వేయగా తాజాగా తిరిగి ప్రారంభించింది. కుటుంబాల్లోని పిల్లల పేర్లు కార్డు లో చేర్చడానికి, అదేవిధంగా కొత్తగా వివాహమైన భార్యాభర్తలు నూతన కార్డు పొందేందుకు అవకాశం కలిగింది.

ఇప్పటికే నూతన కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. గత ఏడాది నవంబర్ లో వైయస్సార్ నవశకం సర్వే ద్వారా అర్హులైన వారి నుంచి పింఛన్, రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వాలంటీర్లు స్వికరించారు. ఇప్పటికే కొత్త పింఛన్లు మంజూరు కాగా రేషన్ కార్డుల ప్రక్రియ కరోనా కారణంగా నిలిచిపోయింది. తాజాగా ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంతో రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఆపత్కాలంలో ఊరట లభించనుంది.

రేషన్ కార్డు ఉంటేనే అమ్మ ఒడి, పింఛన్ ఇతర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కోసం వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి అర్హులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక కొర్రీల బేసిన చంద్రబాబు ప్రభుత్వం అర్హత ఉన్నా కార్డులు మంజూరు చేయలేదు.

కుటుంబ సభ్యుల్లో ఎవరు కార్డులో లేకపోతే వారి ఆధార్ కార్డు నకలు రెవెన్యూ అధికారులకు అందజేయడం ద్వారా రేషన్ కార్డులో చేర్చవచ్చు. కొత్తగా వివాహమైన జంటలు, వివాహమైన వారికి పుట్టిన పిల్లలతో కార్డు పొందాలంటే దంపతులు వారి వారి తల్లిదండ్రులు రేషన్ కార్డు నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు అక్కడ రేషన్ కార్డు పొందాలనుకుంటే ఇక్కడ కార్డు నుంచి తొలగించాలి.

కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వారు తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వే లో నమోదు చేసుకోవాలి. కొత్త దంపతులు వారి పిల్లలు రేషన్ కార్డు తో పాటు ప్రజాసాధికార సర్వే లో పాత కుటుంబం నుంచి విడిపోవాలి. కొత్తగా మరో కుటుంబం కింద నమోదు కావాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతా గ్రామ వార్డు సచివాలయ లోనే జరుగుతుంది. ప్రజలు తమ ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ను తీసుకు వెళ్తే సరిపోతుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా గ్రామం గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Show comments