iDreamPost
iDreamPost
తమను ఆశ్రయించిన వారికి చట్టపరిధిలో న్యాయం చేయడం న్యాయస్థానాల కర్తవ్యం. కింది కోర్టుల నుంచి అత్యున్నతమైన సుప్రీంకోర్టు వరకు వందలు, వేల కొద్దీ తీవ్రమైన కేసులను న్యాయస్థానాలు పరిష్కరిస్తుంటాయి. ఆ క్రమంలో పలు సందర్భాల్లో కొన్ని లోపాలు దొర్లుతూ చట్టపరిధిలో న్యాయం చేయడంలో అన్యాయం జరుగుతుంటుంది. అయితే ఆలస్యమైనా సరే..తమను ఆశ్రయించేవారు శిక్షపడిన ఖైదీలు అయినా సరే సానుకూలంగా స్పందించి గత తీర్పులను సవరించేందుకు కోర్టులు వెనుకాడబోవని సుప్రీంకోర్టు ఒక అరుదైన నిర్ణయంతో స్పష్టం చేసింది. ఓ హత్య కేసులో జీవితఖైదు శిక్షకు గురై.. ఇప్పటికే 17 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకున్న ఓ వ్యక్తి హత్య జరిగిన నాటికి తాను మైనర్ అని పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపి అతనికి విముక్తి కల్పించింది.
ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని మహరాజ్ గంజ్ జిల్లాలో 2004 జనవరి ఎనిమిదో తేదీన ఒక హత్య జరిగింది. విచారణ అనంతరం ఈ కేసులో నిందితులకు జిల్లా సెషన్స్ కోర్టు 2005లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితులు అలహాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసుకోగా కోర్టు తిరస్కరించింది. చివరికి 2009లో సుప్రీంకోర్టు సైతం వారి అప్పీలును తిరస్కరించడంతో శిక్ష తగ్గించుకునే, తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. శిక్షపడిన వారిలో ఒక వ్యక్తి ఇన్నిసార్లు కోర్టుల మెట్లు ఎక్కినా.. ఆ వ్యక్తి తోపాటు అతని న్యాయవాదులు అతి ముఖ్యవిషయం మర్చిపోయారు. కొన్నేళ్ల తర్వాత దాన్ని గుర్తించి.. మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. జీవిత ఖైదు శిక్షకు కారణమైన హత్య జరిగిన రోజునాటికి తాను మైనర్ నని.. ఆ లెక్కన తనను జువెనైల్ హోంకు పంపాల్సి ఉంటుందని పేర్కొంటూ నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు. స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం తన పుట్టిన తేదీ 1989 మే 6 అని.. దాని ప్రకారం అప్పటికి తనకు మైనారిటీ తీరనందున జీవిత ఖైదు శిక్ష విధించడం అన్యాయమని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.
జువెనైల్ బోర్డు నిర్థారణతో విముక్తి
నిందితుడి పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం.. ఆ పిటిషన్ ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ మహరాజ్ గంజ్ జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డుకు ఈ ఏడాది జనవరి 31న పంపింది. నిందితుడు సమర్పించిన ఆధారాలు పరిశీలించిన బోర్డు అతని అసలు పుట్టిన తేదీ 1986 మే 16 అని.. అలా చూసినా హత్య జరిగిన తేదీ నాటికి అతని వయసు 17 ఏళ్ల 7 నెలల 23 రోజులేనని, నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణించాల్సి ఉన్నందున.. నేరం చేసిన నాటికి అతన్ని మైనర్ గానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు జువెనైల్ బోర్డు నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం బాల నేరస్తులను విచారించే అధికారం జువెనైల్ బోర్డుదేనని స్పష్టం చేసింది. కేసు పరిష్కారం అయిన తర్వాత కూడా తన బాల్యత్వాన్ని లేవనెత్తే అర్హత నిందితునికి ఉంటుందని పేర్కొంది.నిబంధనల ప్రకారం ప్రస్తుతం నిందితుడిని జువెనైల్ హోంకు పంపాల్సి ఉంటుందని.. అయితే జువెనైల్ జస్టిస్ చట్టం 2000 ప్రకారం ఏ కేసులోనైనా బాల నేరస్తులకు గరిష్ట శిక్ష మూడేళ్లు జువెనైల్ హోంకు పంపడమేనని గుర్తు చేసింది. కానీ నిందితుడు ఇప్పటికే 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినందున అతన్ని మళ్లీ జువెనైల్ హోంకు పంపడం అన్యాయమే అవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో నిందితునిపై ఇతరత్రా ఎటువంటి కేసులు, శిక్షలు లేకపోతే జీవిత ఖైదు శిక్ష నుంచి విముక్తి కల్పించాలని లక్నో సెంట్రల్ జైలు అధికారులను ఆదేశిస్తూ తీర్పు ప్రకటించింది.