iDreamPost
android-app
ios-app

పరిటాలకు ‘పంచాయతీ’ షాక్‌

పరిటాలకు ‘పంచాయతీ’ షాక్‌

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అంటేనే వర్గాలు, ఫాక్షన్‌ కక్షలు, హత్యలు, రక్త చరిత్ర. అయితే ఇది గతమని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా తెలియజేసిన రాప్తాడు ప్రజలు.. ఈ మార్పు శాశ్వతం కావాలని, మునుపటి బతుకులు వద్దని తాజాగా పంచాయతీ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత రాప్తాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల కుటుంబం పరాజయం చవిచూసింది. రాప్తాడు ప్రజలు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి జై కొట్టారు. ఫ్యాక్షన్‌ వద్దని, అభివృద్ధి ముఖ్యమన్న ప్రకాశ్‌ వెంట నడిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తోపుదుర్తి.. చెప్పిన మాట ప్రకారం రాప్తాడు భూములను సాగునీటితో తడుపుతున్నారు.

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి పనితీరుకు నియోజకవర్గ ప్రజలు జైకొట్టారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులను గెలిపించారు. రాప్తాడు నియోజవర్గంలోని గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలోని 58 పంచాయతీలకు ఎన్నికలకు జరగ్గా, వైసీపీ మద్ధతుదారులు 43 పంచాయతీల్లో జయకేతనం ఎగురవేశారు. టీడీపీ మద్ధతుదారులు కేవలం 12 పంచాయతీలకే పరిమితం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు. ఈ ఫలితాలతో రాప్తాడు ప్రజల మనస్సుల్లో ఏముందో తెలిసిపోయింది. అభివృద్ధికే తాము పట్టం కడతామని రాప్తాడు పల్లె ప్రజలు స్పష్టం చేశారు.

పంచాయతీ ఫలితాలతో పరిటాల కుటుంబం ఖంగుతిన్నది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ప్రత్యర్థి గెలుపు కేవలం గాలివాటం అనే భ్రమలో ఉన్న పరిటాలకు.. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. తమ ఓటమి ఊహించనిది కాదని, ప్రజలు ఫ్యాక్షన్‌ రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారనే విషయం మాజీ మంత్రి పరిటాల సునీతకు, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోనే కాదు.. పరిటాల సొంత మండలం రామగిరిలోనూ టీడీపీ బలపర్చిన అభ్యర్థులు మట్టికరిచారు. ఈ మండంలో 9 పంచాయతీలు ఉండగా.. వైసీపీ మద్ధతుదారులు 7 చోట్ల జయకేతనం ఎగురవేయడం గమనించాల్సిన విషయం.