మనసున్న మా”స్టారు”…

  • Published - 05:56 AM, Fri - 10 January 20
మనసున్న మా”స్టారు”…

రాము సూర్యారావు మాస్టారు… ఏలూరు పరిసర ప్రాంతాల వారికి పరిచయం అక్కర్లేని పేరు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్న పేరు.. కుటుంబ సభ్యులనే నమ్మకుండా, ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో సాటి మనుషులకు సాయం చేస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్న రాము సూర్యారావును చూస్తే అభినవ దానకర్ణుడు అనొచ్చేమో..

రాముసూర్యారావుకి చిన్ననాటి నుండే సేవాగుణం మెండు. చిన్న వయసులోనే స్నేహితులకు సాయం చేస్తూ ఆనందపడేవారు. చదువుకునే వయసులో తన తండ్రి IAS అకాడమీలో కోచింగ్ కోసం ఇచ్చిన డబ్బుని ఫ్రెండ్ రత్నాజి ఫీజు కట్టడానికి ఇబ్బందులు పడుతుంటే తనకి ఇచ్చేసి అతని కళ్ళలో మెరుపుని చూసి ఆనందపడ్డారు.ఇంట్లో తండ్రి తిట్టిన తిట్లు షరా మాములే.. చిన్ననాటి నుండి తండ్రి ఇవ్వడం వాటిని కొడుకు కష్టాల్లో ఉన్నవారికి దానం చేయడం తండ్రి ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతుంటే అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పడం వాళ్ళింట్లో జరిగే దైనందిన కార్యక్రమాలు.. అలా IAS చదువుకి బ్రేక్ పడిన తర్వాత బిఈడీ పూర్తి చేసి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ లో మాస్టారిగా జాయిన్ అయ్యారు.

ఏలూరు ప్రాంతంలో ఎందరో పేద విద్యార్థులు చదువులేక కూలి పనులకు వెళ్తున్నారని గుర్తించి వారికి చదువు చెప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. భార్య కూడా అందుకు సహకారాన్ని ఇవ్వడంతో కొందరు పిల్లల్ని హాస్టల్స్ లో చేర్చి మరి కొందరిని తన ఇంట్లోనే ఉంచుకుని చదువు చెప్పారు రాముసూర్యారావు. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా తన సొంత ఖర్చుతో ఉచితంగా పేద విద్యార్థులకు చదువుతో పాటు అన్ని వసతులు సమకూర్చడంతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పులు ఎక్కువయ్యాయి. అయినా రాముసూర్యారావు మాస్టారు అధైర్యపడలేదు.. ధైర్యంగా ముందడుగు వేశారు. పేద విద్యార్థుల చదువుల కోసం సుమారు 20 ఎకరాల భూమిని అమ్మేయాల్సి వచ్చింది. కొందరు నీకెందుకీ దానధర్మాలని ఆయన్ని ఎగతాళి చేసినా అయన వెనకడుగు వేయలేదు. అలా ఆయన చదువు నేర్పించిన విద్యార్థుల సంఖ్య 5000 పైనే ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. తన దగ్గర విద్యను నేర్చుకున్న ఎందరో విద్యార్థులు నేడు అనేక ఉన్నత పదవుల్లో ఉన్నారు.

ఈలోగా రిటైర్ అయ్యే వయసు వచ్చింది.. ఇంతకుముందులాగా పేద విద్యార్థులకు చదువు చెప్పే వీలుండదని బాధపడినా సేవ చేయడానికిప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించారు మాస్టారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు సేవలు చేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఈలోగా కొందరు నాయకులు వచ్చి, మీరు నిజాయితీగా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇకపై రాజకీయాల్లో చేయమని అందుకు ఎమ్మెల్సీగా నిలబడమని పట్టుబట్టారు. కానీ ఆయన ఒప్పుకోలేదు, సదరు నాయకులు పట్టు విడవకపోవడంతో ఒప్పుకోక తప్పలేదు. నా దగ్గర పోటీ చేసేంత ఆర్ధిక స్తోమత లేదని రాము సుబ్బారావు చెప్పినా మీరు నిలబడితే చాలని నాయకులు అనడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. చేసిన సాయం ఏదొక రూపంలో తిరిగి వస్తుందన్న ఉదాహరణగా ఈ కాలంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీగా ఎమ్మెల్సీగా గెలిచారు.

వార్డ్ మెంబర్ గా గెలిచినా డాబుసరి చూపించే ఈరోజుల్లో ఎమ్మెల్సీకి ప్రభుత్వం ఇచ్చే కార్ ని కూడా ఉపయోగించకుండా కేవలం గన్ మెన్ ని వెంట ఉంచుకుని, గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంటూ అక్కడకు వచ్చే రోగులకు సేవ చేయడం ఆయనకు అలవాటు అయ్యింది. ఒకసారి రోడ్ పై వెళ్తుంటే ఒక ఇంట్లో గొడవ జరగడం చూసి అక్కడకు వెళ్లారు.తీసుకున్న అప్పు తీర్చలేదని కొందరు గొడవపడుతుంటే వారిని ఆపి అప్పు తీసుకున్న సుధాకర్ తరపున కొంత టైమ్ ఇమ్మని అడిగారు. 3 నెలల్లో అప్పు తీర్చాలని దానికి ఒకవేళ అతను అప్పు తీర్చకపోతే మీరే తీర్చాలని సంతకం పెట్టమంటే మధ్యవర్తిగా సంతకం చేశారు. సుధాకర్ రావ్ అప్పు తీర్చకపోవడంతో కోర్టునుండి నోటీసులు అందాయి. రెండురోజుల్లో బాకి తీర్చకపోతే అరెస్ట్ చేస్తామని కోర్టు నోటీసులు పంపేసరికి, ఏం చేయాలో తెలియక కూలబడ్డారు మాస్టారు. కానీ హాస్పిటల్లో రక్తం అర్జెంట్ గా కావాలని కబురు అందడంతో, నాది కూడా అదే గ్రూప్ అని అంత బాధలో కూడా రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు. తీరా రక్తం ఇస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే,తాను రక్తం ఇస్తుంది అప్పు ఎగ్గొట్టిన సుధాకర్ రావు కొడుక్కే అని. దీంతో సుధాకర్ రావు చేసిన తప్పుకి తల దించుకున్నాడు. మీ బిడ్డకి ఏమీ కాదని వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడనుండి బయల్దేరాడు మాస్టారు.

రాముసూర్యారావు మాస్టారు మంచితనం సేవాగుణం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. చంద్రబాబు నాయుడు ఆయన మంచితనాన్ని ప్రత్యేకంగా పొగుడుతూ హాస్పిటల్ అడ్వైజింగ్ కమిటీ చైర్మన్ గా చేయడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది. అలాంటి విద్యను కొన్ని వేల మందికి ఉచితంగా నేర్పించి వారి అవసరాలను తన అవసరాలుగా భావించి వాటిని తీర్చి, రోగులకు సేవ చేస్తూ ఇంకా మానవత్వం బ్రతికే ఉందని రాముసూర్యారావు మాస్టారు నిరూపిస్తూనే ఉన్నారు. మకిలి పడిపోయిన రోజుల్లో కూడా ఏ మకిలి అంటని రాము సూర్యారావు మాస్టారూ అందరికీ ఆదర్శప్రాయుడు..

స్వార్థంతో నిండిపోయిన ఈ కాలంలో ఇంకా సాటి మనుషులకు సాయం చేస్తూ,ఎదుటి వారి కళ్ళల్లో ఆనందం చూసి తన సంతోషంగా భావించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి మహానీయులను చూస్తే మానవత్వం ఇంకా కొందరి మనుషుల్లో మిగిలే ఉందని అర్ధం అవుతుంది.RSR ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు,పేద రోగులకు సేవ చేస్తున్న రాము సూర్యారావు మాస్టారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. MLC పదవిలో ఉండి కూడా నిరాడంబరంగా ఉండే రాము సూర్యారావు మాస్టారు కూడా అలాంటి మహనీయుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show comments