iDreamPost
android-app
ios-app

ఒకే జిల్లాలో IAS, IPS భార్యాభర్తలకి పోస్టింగ్! వీరి లవ్ స్టోరీ తెలుసా?

  • Published Jul 25, 2024 | 5:11 PMUpdated Jul 25, 2024 | 5:11 PM

Eluru SP-IAS Couple Success Story: ఒకే జిల్లాలో IAS, IPS భార్యాభర్తలు పోస్టింగ్ అందుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Eluru SP-IAS Couple Success Story: ఒకే జిల్లాలో IAS, IPS భార్యాభర్తలు పోస్టింగ్ అందుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

  • Published Jul 25, 2024 | 5:11 PMUpdated Jul 25, 2024 | 5:11 PM
ఒకే జిల్లాలో IAS, IPS భార్యాభర్తలకి పోస్టింగ్! వీరి లవ్ స్టోరీ తెలుసా?

నేటి కాలంలో ప్రేమ వివాహాలు చాలా కామన్‌ అయ్యాయి. పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారు సైతం ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోతున్నారు. కారణం జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం.. ఇంకా సెటిల్‌ కాకపోవడం. అవును చదువుకునే వయసులో ప్రేమ పేరుతో టైమ్‌ పాస్‌ చేస్తే.. ఆ తర్వాత జీవితాంతం బాధపడాలి. ఒకవేళ కాలేజీ వయసులో ప్రేమలో పడ్డా.. ముందు కెరీర్‌ మీద దృష్టి పెట్టాలి. జీవితంలో సెటిల్‌ అయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి. అలా బాధ్యతగా ఉన్న వారి జీవితాలే బాగుపడతాయి.. కలకాలం కలిసి ఉంటారు. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్ల లవ్‌ స్టోరీ ఆ కోవకు చెందినదే. అందుకే వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక ఈ ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు. కానీ ఇద్దరికి పరిచయం లేదు. ఆ తర్వాత ఇద్దరూ సివిల్స్ రాశారు. ఒకరు ఐపీఎస్‌కు, మరొకరు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఇక విధి నిర్వహణలో భాగంగా ఒకే జిల్లాకు వచ్చారు. అప్పుడు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఎంతో చక్కగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆఫీసర్స్‌ క్యూట్‌ లవ్‌ స్టోరీ మీకోసం..

ఇప్పుడు మనం చెప్పుకోబేయేది ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌, ఏలూరు జాయింట్‌ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి జంట గురించి. ఇరువురూ మంచి పనితీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. పైగా ఇద్దరిది లవ్‌ మ్యారేజ్‌ కావడం.. విశేషం. ధాత్రిరెడ్డి, కిశోర్.. ఇద్దరూ ఐఐటీ, ఖరగ్‌పూర్‌‌లో ఇంజనీరింగ్ చదివారు. సివిల్స్‌ పాసై.. విధి నిర్వహణలో భాగంగా ఒకే జిల్లాకి వచ్చారు. అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. వివాహం చేసుకున్నారు.

శివ కుమార్ నేపథ్యం..

ఇక కొమ్మిన ప్రతాప్‌ శివ కిశోర్‌ విషయానికి వస్తే.. ఆయన 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. స్వస్థలం నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామం. తండ్రి కొమ్మిన నారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి నిర్మల గృహిణి. ఇంటర్‌ పూర్తిచేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరారు శివ కిశోర్. బయో టెక్నాలజీ, బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు.

ఇంజనీరింగ్‌ అయిపోయిన వెంటనే బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరారు శివ కిషోర్‌. సీనియర్‌ సైంటిస్ట్‌‌గా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో 4 ఏళ్లు పనిచేశారు. రీసెర్చ్‌ కన్సల్‌టెంట్, స్టూడెంట్‌ అడ్వయిజర్‌గానూ విధులు నిర్వహించారు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం చేస్తూనే యూపీఎస్‌సీకి ప్రిపేర్‌ అయ్యారు. తొలి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేదు. ముచ్చటగా మూడోసారి మరింత పట్టుదలతో కష్టపడి చదవి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మూడో ప్రయత్నంలో.. 153వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌‌కు ఎంపికయ్యారు. 2018లో హైదరాబాద్‌ సర్ధార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న శివ కిశోర్‌కు కర్నూలు జిల్లాలో ట్రైనీ ఐపీఎస్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చారు. ఎమ్మిగనూరు నుంచి ఆయన కెరీర్ ప్రారంభమైంది.

ధాత్రి వివరాలు..

ఇక పెద్దిటి ధాత్రిరెడ్డి విషయానికి వస్తే.. ఆమె తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. ధాత్రిరెడ్డి విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఇంటర్‌ తర్వాత ఆమె కూడా ఐఐటీ, ఖరగ్‌పూర్‌‌లో ఇంజనీరింగ్‌ చేశారు. తర్వాత సివిల్స్‌ వైపు అడుగులు వేశారు. తొలుత ధాత్రిరెడ్డి కూడా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2019లో ఐపీఎస్‌ సాధించారు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. ఒడిశా కేడర్ అధికారిణిగా 2020 అక్టోబరులో సబ్‌ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.

అక్కడ పరిచయం.. ఆపై ప్రేమ..

ఇలా ఉండగా.. 2023లో ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు ధాత్రిరెడ్డి. పాడేరు సబ్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. అదే సమయంలో చింతపల్లి ఏఎస్‌పీగా కిశోర్‌ బాధ్యతలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో సైతం విధులు నిర్వహించి అందరి చేత ప్రశంసలు పొందారు. అదే సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పేదలకు సాధ్యమైనంత సేవ చేయాలనే ధాత్రిరెడ్డి, కిశోర్ ఆలోచన. అదే వారిద్దరినీ ఒక్కటి చేసింది.

ఇద్దరూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే.. పైగా ఇద్దరికి సేవా దృక్పథం ఉంది. సివిల్‌ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ వారిలో మచ్చుకైనా ఆ అహంకారం కనిపించదు. ప్రజలతో చక్కగా కలిసిపోతారు. ఇంజనీరింగ్‌ చదివినందు వల్ల ఇద్దరికీ కంప్యూటర్‌ నాలెడ్జిపై పూర్తి అవగాహన ఉంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. చక్కగా చదువుకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుని.. ఆపై పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి లవ్‌ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి