iDreamPost
iDreamPost
ఎవరు ఔనన్నా కాదన్నా ఓటిటి విప్లవం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఉందన్న మాట వాస్తవం. కొంత కాలం పాటు థియేటర్లకు గడ్డురోజులు తప్పవనే క్లారిటీ వచ్చేయడంతో మరికొందరు ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్లు డిజిటల్ స్పేస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడీ రేస్ లో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా తోడయ్యారు. తమిళ దర్శకుడు ఎల్ విజయ్ రూపొందిస్తున్న అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే అంథాలజి సిరీస్ లో ఇద్దరూ భాగం కానున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిలర్ జానర్ లో రూపొందుతున్న ఈ కంటెంట్ లో రకుల్ తో పాటు మరికొందరు పేరున్న హీరోయిన్లు కూడా నటించబోతున్నారు. ఆ వివరాలు కూడా వచ్చాయి.
కంగనా రౌనత్ తో తలైవి లాంటి పాన్ ఇండియా సినిమా తీసిన విజయ్ అది విడుదల కాకుండానే భారీ బడ్జెట్ తో ఈ ఓటిటి ఆఫర్ రావడంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. నివేత పేతురాజ్, మంజిమా మోహన్, విద్యుల్లేఖ రామన్, రెబెక్కా, మేఘా ఆకాష్ తదితరులు కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. అంథాలజి అన్నారు కాబట్టి కథల వారిగా వీరి ఎంట్రీ ఉంటుంది కానీ అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించరన్న మాట. తమన్నా ఇటీవలే ఓటిటి స్పేస్ లో దూకుడు పెంచాక ఇప్పుడు రకుల్ లాంటి వాళ్ళు కూడా అవకాశాలను ఒడిసిపట్టుకునేందకు రెడీ అవుతున్నారు.
ఇప్పుడు సినిమాకు ఓటిటికి కేవలం వీక్షించే ఎక్స్ పీరియన్స్ లో మాత్రమే తేడా. మిగిలినదంతా సేమ్ అనే చెప్పాలి. అందులోనూ గత ఏడాది లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరిగింది. కోట్ల రూపాయలబడ్జెట్ ని పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. సంస్థలు కూడా ఎంత ఖర్చైనా సై అంటున్నాయి. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో మొదలుపెట్టి కోలీవుడ్ లో సూర్య దాకా పెద్ద స్టార్లే అడుగుపెడుతున్న ఈ రంగంలో చాలా తక్కువ సమయంలోనే మరింత దూసుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా టీవీ యాంకర్లుగానే చేయడానికి సిద్ధపడిన మన హీరోలు సరైన ఆఫర్ వస్తే వీటిని కాదనగలరా.