iDreamPost
android-app
ios-app

హీటెక్కిన పార్ల‌మెంట్ : నారాయ‌ణ సింగ్ నిరాహార దీక్ష : ‌విప‌క్షం బాయ్ కాట్

హీటెక్కిన పార్ల‌మెంట్ : నారాయ‌ణ సింగ్ నిరాహార దీక్ష : ‌విప‌క్షం బాయ్ కాట్

రాజ్య‌స‌భ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వ్య‌వ‌సాయ బిల్లు లొల్లి కొన‌సాగుతూనే ఉంది. పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో నోచుకోని ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. విప‌క్ష‌ స‌భ్యుల వాదోప‌వాదాలు మామూలే అయినా.. పోడియం వ‌ద్ద నిర‌స‌న‌లు ఇంత‌కు ముందూ చాలా సార్లు జ‌రిగినా.. ఎంపీల స‌స్పెన్ష‌న్ లు సాధార‌ణ‌మే అయినా.. విప‌క్ష స‌భ్యుల తీరును నిర‌సిస్తూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లేఖ నిరాహార దీక్ష చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసే వరకు స‌మావేశాలను విప‌క్ష స‌భ్యులు బాయ్‌కాట్ చేశారు. ఈ ప‌రిణామాల‌న్నీ పార్ల‌మెంట్ వేదిక‌గా రాజకీయ హీట్ పెంచాయి.

ఎంపీల తీరుకు నిర‌స‌న‌గా…

వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్య‌స‌భ‌లో సభ్యుల ప్రవర్తన తీరు తనను మానసిక వేదనకు గురి చేసిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లేఖ రాశారు. ఈ నెల 20న వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని లేఖ‌లో పేర్కొన్నారు. ఎంపీల తీరుకు నిరసనగా ఈరోజు ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఆదివారం నాటి పరిణామాలతో గత రెండు రోజులుగా నిద్రకూడా పట్టడం లేదని తెలిపారు. సభ్యుల తీరుతో సభకు, సభాపతి స్థానానికి ఊహించలేని స్థాయిలో నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక తాను లోక్ నారాయణ్ జయప్రకాశ్ నారాయణ్ జన్మించిన గ్రామంలో పుట్టానని… ఆయన స్ఫూర్తితో పెరిగానని చెప్పుకొచ్చారు.

ఎంపీల‌కు టీ..

పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీల వ‌ద్ద‌కు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం ఉదయం వెళ్లారు. టీ తీసుకుని మ‌రీ వెళ్లారు. ఈ సంఘ‌ట‌న అక్క‌డి ఎంపీల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ టీ దౌత్యాన్ని ఎంపీలు తిర‌స్క‌రించిన‌ట్లు తెలిసింది. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ప్రకటించి వెంక‌య్యానాయుడుకు లేఖ రాశారు. ఎంపీలలో పశ్చాత్తాపం కోసం, ఆత్మశుద్ధి కోసం తాను టీ తీసుకెళ్లిన‌ట్లు హరివంశ్ నారాయణ సింగ్ తెలిపారు.

స‌మావేశాల బ‌హిష్క‌ర‌ణ‌

రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. సభ్యులపై సస్పెన్షన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.