iDreamPost
iDreamPost
నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రైవేట్ పబ్ లో సింగర్ కం బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మీద జరిగిన దాడి ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. రాత్రే అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రాహుల్ ఎట్టకేలకు ఇవాళ మధ్యాన్నం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పాటు మీడియాకు జరిగిన సంఘటన గురించి వివరణ ఇచ్చాడు. గత రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్లతో పబ్ కు వెళ్ళినప్పుడు బాత్ రూమ్ నుంచి వస్తున్న ఓ ఇద్దరు ఆ అమ్మాయిల గురించి కామెంట్స్ చేస్తూ తన భుజాన్ని కావాలని రాసుకుంటూ వెళ్లారని ఇదేంటని అడిగినందుకే బాటిల్స్ తో దాడి చేశారని చెప్పాడు.
తాను ఒక్కడినే ఉన్నానని వాళ్ళు మాత్రం పది నుంచి పదిహేను మధ్య ఉండటం వల్లే అందులో దెబ్బలు తగ్గిలాయని వివరించిన రాహుల్ మొదట తగవు మొదలుపెట్టింది వాళ్ళేనని స్పష్టం చేశాడు. రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఇలా ప్రవర్తించారని సిసి టీవీ ఫుటేజ్ చూస్తే ఎవరు దూకుడుగా ఉన్నారో అర్థమవుతుందని చెప్పాడు.
రాత్రే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ సమయంలో ఇంట్లో అందరూ ఖంగారు పడుతున్నారని చెప్పాడు. ఇప్పుడిప్పుడే పేరు వస్తున్న తరుణంలో ఇలా జరగడం ఎవరికైనా బాధ కలిగిస్తుందన్న రాహుల్ చట్ట ప్రకారం అందరిని శిక్షించాలని కోరుతున్నాడు. తాను ధీటుగా మాట బదులు ఇచ్చినది వాస్తవమేనని అయితే అది ఎమోషన్ లో జరిగిందే తప్ప వాళ్ళలాగా భౌతికంగా మాత్రం చేయి చేసుకోలేదని చెప్పాడు. అంతేకాదు రాత్రే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకున్నానని అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడని తెలిసిందని ఒకవేళ మాఫీ లాంటి ప్రయత్నాలు జరిగినా తాను మాత్రం వదిలి పెట్టే సమస్యే లేదని చెబుతున్నాడు. మొత్తానికి రాహుల్ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ విన్నర్ గా వచ్చిన పాపులారిటీ వల్ల ఇతను సామాన్య జనానికి కూడా సుపరిచితుడు అయ్యాడు. ఇది ఇంకా ఎన్ని మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.