iDreamPost
android-app
ios-app

రఘురామకృష్ణంరాజు ఏదో ఆశిస్తే, ఎదురుదెబ్బ తగిలిందా

  • Published Jan 13, 2022 | 2:50 AM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
రఘురామకృష్ణంరాజు ఏదో ఆశిస్తే, ఎదురుదెబ్బ తగిలిందా

హైదరాబాద్, ఢిల్లీలో కూర్చుని నిత్యం మీడియా ద్వారా ఏపీ ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేసిన రఘురామకృష్ణంరాజుకి ఎదురుదెబ్బ తగిలింది. రాజద్రోహం కేసులోఇప్పటికే జైలు పాలయినా ధోరణి మార్చుకోకుండా వ్యవహరిస్తున్న ఆయన ఆశలకు గండిపడింది. ఏపీ ప్రభుత్వం మీద, కొన్ని వర్గాల మీద విద్వేష పూరిత వ్యాఖ్యలతో ప్రజల్లో విభజన తీసుకురావాలని వేసిన ఎత్తులు ఫలించలేదు. ఇక సంక్రాంతి సందర్భంగా ఏపీలో అడుగుపెట్టి ఏదో చేయాలనే ఆయన సంకల్పం నెరవేరలేదు.తాజాగా సీఐడీ నోటీసులతో రఘురామకృష్ణంరాజు వెనకడుగు వేయడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రశాంతతను విచ్ఛిన్నం చేయాలనే ఆయన లక్ష్యం నెరవేరకపోవడంతో ఢీలా పడినట్టు కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీ అధినేత అండదండలతో గెలిచి, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన రఘురామకృష్ణంరాజుపై త్వరలో అనర్హత వేటుపడబోతోంది. దానికి అంతా సిద్ధమయిన తరుణంలో రాజీనామా అంటూ కొత్త స్కెచ్ వేశారు. దానికి ముహూర్తాలు కూడా పొడిగిస్తూ ముందుకు సాగుతున్నారు. నిత్యం వార్తల్లో కనిపించాలనే లక్ష్యంతో ఏదో విమర్శల కోసమే విమర్శలు చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. ఆ క్రమంలోనే ఇప్పుడు రాజీనామా, మళ్లీ పోటీ అంటూ హంగామా చేస్తున్నారు. దానికి ముందుగా ఈనెల 12న భీమవరం వస్తున్నట్టు ప్రకటన చేశారు. దానికోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఏకంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచే ర్యాలీ నిర్వహించాలని ప్రణాళిక వేశారు. కోవిడ్ నిబంధనలతో వాటిని పోలీసులు అడ్డుకుంటే, దాని చుట్టూ రచ్చ చేయాలనే సంకల్పంతో సాగుతున్నట్టు పలువురు సందేహించారు.

ఈలోగా గతంలో ఆయన మీద నమోదయిన కేసు విచారణను ఏపీసీఐడీ వేగవంతం చేసింది, నోటీసులు జారీ చేసింది. 13వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ఆ తేదీ వీలుపడదని ఆయన కోరిన మేరకు 17వ తేదీన గుంటూరులో సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని మరో నోటీసు కూడా అందించింది. దాంతో రఘురామకృష్ణంరాజు ఖంగుతినాల్సి వచ్చింది. తన లక్ష్యం నెరవేర్చుకుని, ఏపీలో రాజకీయ రచ్చ చేయాలని ఆశిస్తే, తన మీద ఉన్న కేసులు అందుకు ఆటంకంగా ఉండడంతో ఆయన భంగపాటుకి గురయ్యారు. తన కేసు విచారణకు నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దానికి కూడా కులం, మత సెంటిమెంట్ పూసి పబ్బం గడుపుకునే యత్నం చేశారు. కానీ ఇప్పటికే ఆయన అసలు రంగు జనాలకు తెలిసిపోవడంతో ఇటీవల ఎవరూ పెద్దగా ఖాతరు చేయడంలేదనే సంగతి ఆయన మరచిపోతున్నట్టున్నారు.

తాజాగా భీమవరం, నర్సాపురం ప్రాంతాల్లో రఘురామకృష్ణంరాజు పర్యటన విరమించుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన అనూహ్యంగా ఎటువంటి నిర్ణయమయినా తీసుకునే అవకాశం ఉంది. ఏదయినా ఏపీలో రాజకీయంగా గలాటా సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు ఏదోటి చేసేందుకు సిద్ధపడతారని పలువురి అభిప్రాయం. పరిస్థితి చక్కదిద్దడానికి కష్టపడాలే గానీ, సామరస్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద పని ఏముందనే రీతిలో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు తీరు ఉందనే వాదన బలపడుతోంది. రాష్ట్రంలో ప్రశాంతతను భగ్నం చేయాలనే ఆలోచన తప్ప బాధ్యతగల స్థానంలో ఉన్నామనే విషయాన్ని కూడా ఆయన మరచిపోవడం విస్మయకరమని కొందరు అంటున్నారు. ఏమయినా తాజాగా రఘురామకృష్ణంరాజుకి అనుకున్నదొకటి, అయ్యిందొకటి అన్న చందంగా మారడం విశేషం.

Also Read : రఘురామకృష్ణంరాజు ఇంటికి మరోసారి ఏపీ సీఐడీ అధికారులు, అసలేం జరుగుతోంది..