హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. BJP MLA రాజా సింగ్ వ్యాఖ్యల వివాదం ఈ ప్రాంతాన్ని భద్రతా వలయంలోకి నెట్టింది. బుధవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు (RAF) రంగంలోకి దిగాయి. గత రాత్రి కూడా అదనపు బలగాలు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పహరా కాశాయి. రాజా సింగ్ కి వ్యతిరేకంగా ఓల్డ్ సిటీలో నిరసనలు జరుగుతుండడంతో పోలీసులు ఈమేరకు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. RAF, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఓల్డ్ సిటీకి వెళ్ళే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓల్డ్ సిటీలో పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకోవాలంటూ పోలీసులకు సూచనలు చేశారు.
గోషామహల్ MLA రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. దీన్ని వెంటనే తీసేశారు. పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.