రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిందో.. ఆరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాలన్నీ ఆ ఆక్రమణను ఖండిస్తూనే ఉన్నాయి. కొన్ని దేశాలు ఏకంగా రష్యాతో తమ ఆర్థిక, దౌత్య సంబంధాలను వదులుకున్నాయి. మరి ఇంత జరుగుతున్నా రష్యా ఎలా దృఢంగా నిలబడింది??
రష్యాలో 1,000కు పైగా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను విడిచిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా డబ్బును తరలించే అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ- రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపజేశాయి, దాని 630 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను వినియోగించకుండా నిరోధించాయి. ఇలాంటి చర్యలతో రష్యా పతనం ఖాయమని భావించారు ఆర్థికవేత్తలు. కానీ, అందుకు విరుద్ధంగా జరుగడంతో అంతా ఆశ్ఛర్యపోయారు.
ఇందుకు ఏకైక కారణం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ రష్యాను కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఇందుకు సిద్ధం చేయడమే. తమ కరెన్సీ నిల్వలను పెంచుకోవడం, డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడం, చైనాతో స్నేహం చేయడం ద్వారా పాశ్చాత్య ఆర్థిక ఒత్తిడిని భరించడం వంటి ప్రక్రియలతో రష్యాను క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కునేందుకు వీలుగా సిద్ధం చేశాడు. చాలా మంది ఊహించిన దానికంటే మెరుగ్గా ప్రపంచం నుంచి ఆర్థిక ఒంటరితనానికి దేశం అలవాటు పడేలా చూశాడు పుతిన్.
మరోవైపు రష్యా వ్యాపారవేత్తలు వివిధ రకాల విదేశీ ఔట్లెట్లను కొనుగోలు చేశారు. మరికొంతమంది షాపింగ్ మాల్స్ వంటి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఇలా మరొకరిపై ఆధారపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు పుతిన్.
ఆ కారణంగానే, ఇంతలా యుద్ధం జరుగుతున్నా రష్యా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నెట్టుకురాగలిగింది. అయితే రష్యా నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లో చమురు మార్కెట్ ను అస్థిరపరిచింది.
కానీ ప్రస్తుతానికి రష్యా ఆర్థిక వ్యవస్థ తేలుతూ ఉంది. రష్యాలో ఈ ఆర్థిక భారాన్నంతా సామాన్య రష్యన్లు మోస్తున్నారు. ఈ ఏడాది వారి నిజమైన వేతనాలు 6% తగ్గుతాయని అంచనా. వీటికి తోడుగా ఆంక్షల భారం సైతం వారిపైనే పడుతోంది.