iDreamPost
iDreamPost
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ క్రమం తప్పకుండా ఆగుతూ సాగుతూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య టీంలో ఎవరికో కరోనా రావడంతో కొంత కాలం బ్రేక్ వేశాక మళ్ళీ రీ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి రెండు సమస్యలు మాత్రం యూనిట్ ని బాగా టెన్షన్ పెడుతున్నాయట. అందులో ప్రధానమైనది విజయ్ సేతుపతి డ్రాప్ చేసుకున్న నెగటివ్ క్యారెక్టర్. ఇప్పటిదాకా రీ ప్లేస్ మెంట్ జరగలేదు. సుకుమార్ ఎవరెవరినో ట్రై చేస్తున్నాడు కానీ ఫలితం దక్కడం లేదు.
ఇక రెండో సమస్య ఐటెం సాంగ్. ఆర్య, ఆర్య2లో దేవిశ్రీ ప్రసాద్ తో ఎప్పటికీ మర్చిపోలేని మాస్ మసాలా సాంగ్స్ చేయించుకున్న సుక్కు ఇందులో కూడా వాటిని మించే స్థాయిలో ఓ పాటను రెడీ చేయించారట. ఆషామాషీ కాదు కాబట్టి నోటెడ్ హీరొయిన్ తోనే చేయించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ భామ దిశా పటానిని అడిగితే కేవలం నాలుగు నిమిషాల పాటకు కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన నిర్మాతలు ఆరు నెలలు కాల్ షీట్స్ ఇస్తేనే అంత పారితోషికం సాధ్యం కాని పరిస్థితుల్లో ఏకంగా ఇంత డిమాండ్ చేయడంతో నో అన్నారని టాక్.
ఇప్పుడు బన్నీకి జోడిగా ఎవరు ఆడిపాడతారనేది సస్పెన్స్ గా మారింది. ఏదో ఒకటి వీలైనంత త్వరగా ఫైనల్ చేయాలి. పదే పదే బ్రేకులు పడుతున్న పుష్ప వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి విడుదలకు ప్లాన్ చేయాలనీ అల్లు అర్జున్ ఆలోచనట. కాని అందుకు పరిస్థితులు సహకరించడం లేదు. మరొవైపు ఇది కాగానే కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. అఫ్ కోర్స్ అక్కడ ఆచార్య అయిపోతేనే శివ వస్తాడు. రష్మిక మందన్న హీరొయిన్ గా నటిస్తున్న పుష్పలో సునీల్ ఓ కీలకమైన క్యారెక్టర్ చేస్తున్నట్టు వినికిడి. ఇంకా చాలా వివరాలు బయటికి రావాల్సి ఉంది. సంక్రాంతికి కొత్త పోస్టర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.