Puli Bebbuli : టైటిల్ కు తగ్గట్టు కృష్ణంరాజు చిరంజీవిల కలయిక – Nostalgia

ఇప్పుడంటే రెబల్ స్టార్ అంటే ప్రభాస్ అంటాం కానీ ఆ బిరుదుకి ఒరిజినల్ ఓనర్ మాత్రం పెదనాన్న కృష్ణంరాజే. మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఈయన నెక్స్ట్ జెనరేషన్ స్టార్లతో కూడా చాలా సినిమాలు చేశారు. అందులో చిరంజీవితో కూడా ఉన్నాయి. మొదటిసారి ఈ కలయిక సాధ్యమయ్యింది మనవూరి పాండవులతో. ఆ తర్వాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ముకద్దర్ కా సికందర్ రీమేక్ ప్రేమ తరంగాలుతో రిపీట్ చేశారు. పై రెండు బ్లాక్ బస్టర్స్ కాదు కానీ మొదటిది క్లాసిక్ కాగా రెండోది కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. అంతకుముందు ఆడాళ్ళు మీకు జోహార్లు అదేమంత మంచి ఫలితం అందుకోలేదు

1983. చిరంజీవికి అప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. శుభలేఖ, అభిలాష, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాల వల్ల క్లాసు మాసు రెండింట్లోనూ అభిమానులు వచ్చేశారు. ట్రెండ్ సెట్టర్ ఖైదీకి ముందు ఇదంతా. నిర్మాత గురుపాదం ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకుని చిరంజీవి కృష్ణంరాజు కాంబినేషన్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఓ కథను సిద్ధం చేయించారు. సత్యానంద్ సంభాషణలు సమకూర్చి స్క్రిప్ట్ ని చేతికిచ్చారు. వినగానే ఇద్దరూ హీరోలు ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు. రాధిక, జయప్రద హీరోయిన్లుగా ఎంపిక కాగా రాజన్ నాగేంద్ర స్వరాలు సమకూర్చారు.

యాక్షన్ డ్రామాలు అద్భుతంగా డీల్ చేస్తారని పేరున్న కెఎస్ ఆర్ దాస్ దర్శకుడిగా నిర్మాణం ప్రారంభమయ్యింది. బాల్యంలో విడిపోయి పెద్దయ్యాక ఊహించని పరిస్థితుల్లో శత్రువులుగా కలుసుకున్న ఇద్దరు స్నేహితుల కథ ఇది. తర్వాత ఒక్కటై విలన్ల భరతం పడతారు. కృష్ణంరాజుకి త్యాగపూరిత పాత్ర డిజైన్ చేయగా చిరంజీవికి యాక్షన్ ఫ్లేవర్ జోడించారు. 1983 జూన్ 16 విడుదలైన పులి బెబ్బులి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేదు కానీ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంది. కేవలం నెలన్నర గ్యాప్ లో వచ్చిన చిరంజీవి కొత్త సినిమాలు గూఢచారి నెంబర్ 1, మగమహారాజు, రోషగాడు ఫలితాలు పులిబెబ్బులి లాంగ్ రన్ మీద ప్రభావం చూపించాయి

Also Read : Seenu : ఫ్యామిలీ హీరో సాహసాన్ని తిప్పి కొట్టారు – Nostalgia

Show comments